అమ్మఒడి పథకం మూడో విడత సాయంలో 1.29 లక్షల మంది తల్లులకు ప్రభుత్వం కోత పెట్టనుంది. 2021 జనవరి 11న 44,48,865 మంది బ్యాంకు ఖాతాల్లో సాయాన్ని జమ చేయగా.. ఈ ఏడాది 43,19,090 మందిని అర్హులుగా తేల్చింది. వీరిలో 1,46,572 మందికి ఈ-కేవైసీ పూర్తికాలేదు. విద్యుత్తు వాడకం నెలకు 300 యూనిట్లు దాటినా.. విద్యార్థికి 75% హాజరు లేకపోయినా అమ్మ ఒడికి అర్హత కోల్పోతారు. కొత్త బియ్యం కార్డు ఉండడం, బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింకు చేసుకోవడం లాంటివి పూర్తి చేయకపోయినా ప్రయోజనం అందదని ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అమ్మఒడి పథకం మూడో విడత సాయాన్ని ఈ నెల 27న తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 2020, 2021లో విద్యార్థులకు 75% హాజరు నిబంధనను అమలు చేయలేదు. దీంతో మొదటి ఏడాది 43 లక్షలు, రెండో ఏడాది 44.48 లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా తేలారు. తాజాగా నిబంధనలను విధించడంతో కోత పడింది.
ఆగస్టు 16 నుంచి పాఠశాలలు తెరిచినా కరోనా మూడోదశ రావడంతో కొన్నిచోట్ల తల్లిదండ్రులు పిల్లల్ని బడికి పంపలేదు. దీంతో చాలామందికి 75% హాజరు పడలేదు.
అనర్హుల జాబితా ఎక్కడ?:గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అర్హుల జాబితాను పంపించిన ప్రభుత్వం.. అనర్హుల జాబితాను మాత్రం ఇవ్వలేదు. వారు ఎందుకు అనర్హులయ్యారో తెలుసుకునే అవకాశాన్ని కల్పించలేదు. దీంతో జాబితాలో పేర్లు లేని తల్లులు సచివాలయ అధికారులను ప్రశ్నిస్తున్నారు. తల్లుల నుంచి ఒత్తిడి పెరగడంతో సచివాలయ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించినా అక్కడి నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఈ ఏడాది అమ్మఒడి పథకం అమలు బాధ్యతను పాఠశాల విద్యాశాఖ నుంచి తప్పించి గ్రామ, వార్డు సచివాలయ విభాగానికి అప్పగించారు.