అరటి రైతులకు మళ్లీ ధరల సెగ మొదలైంది. రాయలసీమలో రెండు మూడు రోజుల కిందట కిలో రూ.8 నుంచి రూ.9 వరకు పలికిన ధరలు.. ఇప్పుడు కిలో రూ.4 నుంచి రూ.6కు పడిపోయాయి. స్థానిక వినియోగ రకాల్లో కర్పూరం, భుషావలి రకాల గెలల ధరలు మరింత దిగజారాయి. వర్షాలు, ఈదురు గాలులకు పంట దెబ్బతింటుందనే భయంతో ఎంతకైనా ఇస్తారనే వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారని రైతులు వాపోతున్నారు. కిలోకు రూ.8 చొప్పున మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.
పెరిగి.. మళ్లీ తగ్గి
కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఎగుమతి రకాల అరటి సాగు చేస్తారు. లాక్‌డౌన్‌తో విదేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. ఇతర రాష్ట్రాల మార్కెట్లు మూతపడ్డాయి. దీంతో వీటిని కొనే వారు లేక.. పొలాల్లోనే మగ్గిపోయాయి. తర్వాత ప్రభుత్వం కిలో రూ.3.50 చొప్పున కొనుగోలు చేయించి వివిధ మార్కెట్లకు పంపింది. తర్వాత ఇతర రాష్ట్రాల మార్కెట్లు తెరవడంతో ధర కాస్త పెరిగి.. కిలో రూ.8 నుంచి రూ.9 వరకు లభించింది. వారం రోజులుగా ఇది మందగించింది. తుపాను హెచ్చరికలు.. ఈదురుగాలులు, వర్షాలు కురుస్తుండటంతో కొన్నిచోట్ల అరటి నేల వాలుతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆలస్యమైతే ఈ ధరా దక్కదని అడిగినంతకు విక్రయిస్తున్నారు. కిలో రూ.4.30 చొప్పున అరటిని విక్రయించానని కడప జిల్లా వెలిగండ్ల రైతు రాఘవరెడ్డి వివరించారు. ఉత్తరాదిన మార్కెట్లు తీస్తే.. ధర పెరుగుతుందేమో అని కొందరు రైతులు ఎదురు చూస్తున్నారు.