రాష్ట్రంలో మద్యం దుకాణాల నిర్వహణ ప్రభుత్వమే నేరుగా నిర్వహిస్తుంది. ఇకపై ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే మద్యం దుకాణాలు పనిచేయనున్నాయి. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ నేతృత్వంలో మద్యం దుకాణాలు నడపనున్నారు. నిన్నటి వరకూ ప్రైవేటు వ్యాపారుల నేతృత్వంలో కొనసాగిన మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ నడిచేవి. అయితే దశలవారీగా మద్య నిషేధం అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం దుకాణాలు తెరిచి ఉంచే సమయాన్ని కుదించింది. తొలుత ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ తెరిచి ఉంచాలని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని సవరిస్తూ ఎక్సైజ్ శాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4, 380 మద్యం దుకాణాలున్నాయి. వీటిలో 20 శాతం దుకాణాలను తగ్గించి, నేటి నుంచి నుంచి 3500 దుకాణాలే నడపనున్నారు. ప్రస్తుతమున్న పర్మిట్ రూములు ఇకపై ఉండవు. మద్యం దుకాణాలతో ఏవైనా సమస్యలు తలెత్తితే ప్రజలు నేరుగా గ్రామ సచివాలయాల్లోని మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు.
నేటి నుంచి ప్రభుత్వ దుకాణాల్లోనే మద్యం విక్రయాలు
దశలవారీగా మద్య నిషేధం అమలుకు ఎక్సైజ్ శాఖ సిద్ధం అవుతోంది. దీనిలో భాగంగా నేటి నుంచి సర్కార్ ఆధ్వర్యంలోనే మద్యం విక్రయాలు జరగనున్నాయి. పర్మిట్ రూములు ఇకపై కనుమరుగుకానున్నాయి. మరోవైపు మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.
చివరి రోజు భారీగా రాయితీలు
జూన్ నెల నుంచి ఇప్పటివరకూ మద్యం విక్రయాలు 15 శాతం మేర తగ్గినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు మద్యం ధరల పెంపునకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ముందస్తుగానే దుకాణాలకు నిల్వలు పంపింది. ప్రైవేటు మద్యం దుకాణాలు కొనసాగుతున్న ప్రాంగణాలనే చాలా వరకూ ఏపీఎస్ బీసీఎల్ అద్దెకు తీసుకుంది. నిబంధనల ప్రకారం ఈ ప్రాంగణాలు ఏపీఎస్ బీసీఎల్ ఆధీనంలోకి వచ్చేంతవరకూ అక్కడ మద్యం నిల్వలు పెట్టకూడదు. కానీ రాష్ట్రంలోని చాలా చోట్ల నాలుగైదు రోజులు ముందుగానే ఆ ప్రాంగణాలకు ఈ సంస్థ మద్యాన్ని తరలించింది. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు వ్యాపారుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న దుకాణాల గడువు సోమవారం రాత్రితో ముగియటంతో తమ వద్దనున్న సరుకును విక్రయించేసేందుకు పలుచోట్ల భారీగా రాయితీలిచ్చారు . వీటి కోసం మందుబాబులు ఎగబడ్డారు.