క్షేత్రస్థాయి పరిస్థితులను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థల్లో రుసుములను ఖరారు చేస్తూ ఏకపక్షంగా జీవోలు జారీ చేసిందని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు హైకోర్టుకు విన్నవించాయి. రుసుములను ఖరారు చేసే ముందు విద్యాసంస్థల్లోని మౌలిక సదుపాయాల కల్పన, వ్యయాలను దృష్టిలో పెట్టుకోలేదని గుర్తుచేశాయి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులతో విద్యా సంస్థల నిర్వహణ, మెరుగైన విద్యా బోధన సాధ్యం కాదని సీనియర్ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, బి.ఆదినారాయణరావు, పి.వీరారెడ్డి కోర్టుకు తెలిపారు. తల్లిదండ్రులు సంతృప్తి చెంది ప్రైవేటు విద్యా సంస్థల్లో పిల్లల్ని చేర్పిస్తారన్నారు. పంచాయతీ, మున్సిపాలిటీ¨, మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలుగా విద్యా సంస్థలను విభజించి రుసుములను నిర్ణయించడానికి చట్ట నిబంధనలు అంగీకరించవని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో రుసుములను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆగస్టు 24న 53, 54 జీవోలు ఇచ్చింది. వీటిని సవాలు చేస్తూ ‘తూర్పు గోదావరి ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్’ అధ్యక్షుడు దాసరి దుర్గా శ్రీనివాసరావు, మరికొన్ని విద్యాసంస్థల తరఫున వ్యాజ్యాలు వేశారు. సోమవారం పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలు ముగిశాయి. విచారణ ఈ నెల 9కి వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూ.దుర్గాప్రసాదరావు సోమవారం ఈ ఆదేశాలిచ్చారు.
రుసుముల నిర్ణయం మా హక్కు: విద్యా సంస్థలు