చాలారోజుల తర్వాత సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ తీసుకున్న అప్పు చేతికి చిక్కలేదు. రుణ మొత్తం ఓవర్ డ్రాఫ్టు(ఓడీ) కింద ఆర్‌బీఐకే జమ చేయాల్సి వచ్చినట్లు సమాచారం. కొత్త అప్పులు పొందేందుకు రాష్ట్రం ఇటీవల అనేక కష్టాలు పడుతోంది. ఏ రూపంలో రుణం తీసుకునేందుకు ప్రయత్నించినా అవాంతరాలు ఎదురవుతున్నాయి. విద్యుత్తు రంగ సంస్కరణలతో అదనంగా రూ.2,133 కోట్లను రుణంగా తీసుకునేందుకు కేంద్రం పది రోజుల కిందట అనుమతిచ్చింది. దాంతో రాష్ట్రం మంగళవారం సెక్యూరిటీల వేలంలో పాల్గొంది. రూ.1000 కోట్లను 16 ఏళ్ల కాలపరిమితితో 7.37% వడ్డీ చెల్లించేలా, మరో రూ.1000 కోట్లను ఇరవై ఏళ్ల కాలపరిమితికి అదే వడ్డీ రేటుతో రుణాలుగా తీసుకుంది. ఇప్పటికే ఆర్‌బీఐ వద్ద ఏపీ ఖజానా వసూళ్లకు మించి నిధులను వాడుకున్నందున తాజాగా తీసుకున్న అప్పు మొత్తం ఓడీకే సర్దుబాటు చేయాల్సి వచ్చినట్లు తెలిసింది.
మూడు విధాలుగా వెసులుబాటు
రాష్ట్ర రాబడికి మించి వ్యయం ఉన్నప్పుడు... ఖర్చులను వెళ్లదీయడానికి అప్పులు తీసుకునేందుకు రిజర్వుబ్యాంకు వివిధ రకాల అనుమతులు ఇస్తుంది. ఇందులో భాగంగా వేస్ అండ్ మీన్స్ రూపంలో నిధులను సమకూర్చుకోవచ్చు. ఆ పరిమితి దాటితే ప్రత్యేక డ్రాయింగు సదుపాయం వినియోగించుకుని మరిన్ని నిధులు తీసుకోవచ్చు. దీని పరిమితి కూడా దాటిపోయాక ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ఉంటుంది. ఓడీ కోటాలో తీసుకున్న నిధులన్నీ సంబంధిత వడ్డీతో తిరిగి రిజర్వుబ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా ఒక రకమైన అప్పు లాంటిదే.