ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.28వేల కోట్ల రుణం తీసుకునేందుకు కేంద్ర ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. దాదాపు నెల రోజులకుపైగా కేంద్రానికి, రాష్ట్రానికీ మధ్య సాగుతున్న ఉత్తర ప్రత్యుత్తరాల నేపథ్యంలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ మేరకు అనుమతులు ఇచ్చినట్లు తెలిసింది. కేంద్ర ఆర్థికశాఖ అధికారులు సోమవారం అన్ని రాష్ట్రాల ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు.
ఇందులో కేంద్ర ఆర్థికశాఖ అధికారులతో జరిగిన చర్చల్లో ఈ అనుమతులు లభించినట్లు తెలిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీఎస్‌డీపీ రూ. 12,01,736 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో 3.5శాతం మేర బహిరంగ మార్కెట్ రుణ పరిమితిగా తీసుకుంటే రూ.42,060.76 కోట్ల రుణానికి అర్హత లభిస్తుంది. దీనికి గతంలో రూ.16వేల కోట్ల మేర చెల్లించిన రుణ మొత్తాన్ని కలపాలని ప్రభుత్వం కోరింది. ఆర్థిక సంవత్సరం మొదట్లో ప్రభుత్వం వేసిన లెక్కల ప్రకారం దాదాపు రూ.71వేల కోట్ల నికర రుణ పరిమితిగా తేల్చింది. ఆ తరవాత అనేక పరిణామాల నేపథ్యంలో రాష్ట్రం రూ.61 వేల కోట్ల మేర రుణ పరిమితికి అనుమతి కోరినట్లు తెలిసింది. గతంలో అధికంగా తీసుకున్న రుణాలు, ఇతరత్రా మరికొన్ని అంశాలను లెక్కలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం రూ.33వేల కోట్ల మేర ఏపీ ప్రతిపాదనల్లో కోత పెట్టినట్లు సమాచారం.దీంతో ప్రస్తుతం 12 నెలల కాలంలో రూ.28వేల కోట్ల బహిరంగ మార్కెట్ రుణంతోనే ముందుకు సాగవలసి ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.46,443 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్ ద్వారా రుణాన్ని సమీకరించింది.