ఏడాది క్రితంతో పోలిస్తే.. మధ్యతరగతి కుటుంబంపై పప్పులు, వంట నూనెల రూపంలోనే నెలకు రూ.250 వరకు భారం పడుతోంది. సగటున నెలకు 3 లీటర్ల నూనె వినియోగించే కుటుంబానికి గతంలో రూ.311 వరకు అయ్యేది. ఇప్పుడదే రూ.450 అవుతోంది. అంటే సగటున రూ.140 వరకు పెరిగింది. 2018 మార్చితో పోలిస్తే.. పామాయిల్ ధర 97%, వేరుసెనగ, సన్‌ఫ్లవర్ నూనెల రేట్లు 67% ఎగబాకాయి. నాలుగు రకాల పప్పులు కిలో చొప్పున తీసుకుంటే అప్పట్లో రూ.375 ఉంటే.. ఇప్పుడవి రూ.445 అయ్యాయి. మూడేళ్ల క్రితంతో పోలిస్తే వీటి ధరలూ 30-78% మేర పెరిగాయి. ఎగుమతుల డిమాండుతో వేరుసెనగ ధరలు చుక్కలనంటుతున్నాయి.
వేరుసెనగల ధర సగటున కిలో రూ.150 వరకు పలుకుతోంది. చింతపండు కిలో ధర గతేడాది రూ.168 ఉండగా.. ఇప్పుడు రూ.240 వరకు చేరింది. కొత్త పండు మార్కెట్‌లోకి వస్తున్నా.. కిలోకు రూ.70 వరకు పెరగడం గమనార్హం. సజ్జలు, ఎర్ర జొన్నల ధరలు కిలో రూ.50-60 మధ్యకు చేరాయి.
*దుస్తులు ఉతకడానికి ఉపయోగించే డిటర్జెంట్, లిక్విడ్ ధరలూ కిలో/లీటరుకు రూ.20 వరకు పెరిగాయి. యాలకులు, లవంగాలు తదితర సుగంధ ద్రవ్యాల ధరల్లోనూ పెరుగుదల కనిపిస్తోంది.
*మొన్నటి వరకు కిలో రూ.50పైగా పలికిన ఉల్లి.. మెల్లిగా దిగి వస్తోంది. కిలో రూ.30-35 అయింది. వెల్లుల్లి కిలో రూ.100కు చేరింది. కూరగాయల రేట్లు మాత్రం నిరుటి మార్చితో పోలిస్తే.. కాస్త ఊరటనిస్తున్నాయి.
మధ్యతరగతికి మోయలేని భారమే