తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ పథకం కింద బాలింతల తరలింపు టెండరును అరబిందో ఫార్మా ఫౌండేషన్, శ్రీనివాస టూర్స్ అండ్ ట్రావెల్స్ కన్సార్షియం సంస్థ దక్కించుకుంది. ప్రస్తుతం ఒక బాలింతను ఇంటికి చేరిస్తే రూ.649 చెల్లిస్తున్నారు. కొత్త టెండర్ ప్రకారం రూ.895 చెల్లిస్తారు. ప్రస్తుత విధానంలో కంటే అదనంగా రూ.246 (37.90%) చెల్లించబోతున్నారు. దీనివల్ల ప్రభుత్వంపై అదనంగా ఏడాదికి రూ.ఆరేడు కోట్ల భారం పడబోతుంది. ప్రస్తుతం ఏడాదికి రూ.18 కోట్ల వరకు ఖర్చు అవుతోంది. ఒక్కో ట్రిప్పులో బాలింత, శిశువు, ఒక సహాయకులను మాత్రమే ఆసుపత్రుల నుంచి ఇళ్లకు మారుతీ సుజుకీ ఈకో వాహనంలో తరలించాలి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 500 వాహనాలు నడపాల్సి ఉంటుంది. ప్రస్తుతం నెలకు 20 వేల మంది బాలింతలను ఇళ్లకు చేరుస్తున్నారు. కొత్త సంస్థ వాహనాలను సిద్ధంచేసి, బాలింతలను తరలించేందుకు కనీసం రెండు నెలల వరకు సమయం పడుతుంది.
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ పథకం బాధ్యతను 2016లో టెండరు ద్వారా జీవీకే ఈఎంఆర్‌ఐ సంస్థకు అప్పగించారు. ఒక్కో బాలింత తరలింపునకు రూ.499 చెల్లించారు. ఈ సంస్థకు కేటాయించిన మూడేళ్ల కాల వ్యవధి ఎప్పుడో ముగిసింది. ఈ గడువును ఏడాదికి 10% అదనపు చెల్లింపుతో పెంచుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో ట్రిప్పునకు రూ.649 చెల్లిస్తున్నారు. 275 వాహనాలు నడుపుతున్న ఈ సంస్థకు సకాలంలో ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరగడంలేదు. దీనివల్ల తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ అమలు పూర్తిగా గాడితప్పింది. ప్రస్తుతం ఒక్కో ట్రిప్పులో ఇద్దరు బాలింతలను కూడా తరలిస్తున్నారు. కొత్త విధానంలో ఒక బాలింతను మాత్రమే ఇళ్లకు తరలించాలని నిబంధన పెట్టారు. వాస్తవానికి ఇద్దర్ని తరలించేలా బోలేరా వంటి పెద్ద వాహనాన్ని పెట్టాలని వైద్యారోగ్య శాఖ సూచించింది. మరో ఆప్షన్ కింద ఒక బాలింతను తరలించేందుకు సరిపోయే వాహనాన్ని నడిపే సంస్థను ఎంపిక చేయాలని కూడా తెలిపింది. అయితే ప్రభుత్వం ఒక బాలింతను తరలించేందుకు వీలుగా సంస్థను ఎంపికచేసింది. దీనివల్ల ఆసుపత్రుల నుంచి బాలింతల తరలింపులో జాప్యం అనివార్యం కానుంది.
"ప్రస్తుత సంస్థ నడిపే 275 వాహనాలకు అదనంగా మరో 225 వాహనాలు అందుబాటులోనికి వస్తాయి. అంతేకాకుండా పెట్రోల్ ధరలు, జీఎస్టీలతో వ్యయం పెరిగింది. ప్రస్తుతం నిర్ణయించిన ప్రకారమే మూడేళ్ల వరకు చెల్లింపులు ఉంటాయి. ఒక బాలింతను మాత్రమే వాహనంలో తరలిస్తే శిశువు, సహాయకులకు సౌకర్యంగా ఉంటుంది".