Rosaiah funerals news: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు అశ్రునయనాల నడుమ ముగిశాయి. మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రం దేవరయాంజాల్ ఫామ్హోస్లో తెలంగాణ ప్రభుత్వం..అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించింది. సాయంత్రం 3 గంటల 50 నిమిషాలకు శాస్త్రోక్తంగా అంత్యక్రియల ప్రక్రియను పూర్తి చేశారు. అంతిమ సంసస్కారాలకు ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, బోత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పేర్నినాని, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, మాజీ మంత్రులు గీతారెడ్డి, శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎమ్మెల్యేలు వివేకానంద, గణేశ్ గుప్తా, కోలేటి దామోదర్ గుప్తా, తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్ వకులాభరణం కృష్ణ మోహన్ రావు తదితరులు హాజరయ్యారు.
ప్రముఖుల నివాళులు
రోశయ్య కడచూపు కోసం అనేక మంది రాజకీయ ప్రముఖులు అమీర్‌పేట్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. మెగాస్టార్ చిరంజీవి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సహా ప్రముఖులు రోశయ్య భౌతికకాయానికి నివాళి అర్పించారు. ప్రజాసేవలో రోశయ్య సేవలను కొనియాడుతూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. రోశయ్య కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ భగవంతుడు వారికి ధైర్యాన్ని ప్రసాదించాలని వేడుకున్నారు.
సోనియా గాంధీ నివాళి
former cm rosaiah death:అమీర్‌పేట నుంచి అభిమానులు, ప్రజల సందర్శనార్ధం రోశయ్య భౌతికకాయాన్ని గాంధీభవన్‌కు తరలించారు. సోనియా గాంధీ దూతగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే రోశయ్యకు నివాళి అర్పించారు. భారీ సంఖ్యలో అభిమానులు ఆయన కడచూపు కోసం గాంధీభవన్‌కు తరలి వెళ్లారు. కన్నీటితో తమ ప్రియనేతను గుర్తు చేసుకున్నారు. గాంధీభవన్ నుంచి రోశయ్య అంతిమయాత్ర కొంపల్లిలోని ఆయన వ్యవసాయక్షేత్రానికి సాగింది. రోశయ్య వ్యవసాయక్షేత్రంలో హిందూ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. రోశయ్య మృతికి నివాళిగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మూడ్రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించాయి.