లండన్ కేంద్రంగా వెలువడుతున్న బ్రిటీష్ దినపత్రిక ది టైమ్స్. రెండు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన పత్రిక. ఎంతోమంది ప్రముఖుల గురించి అందులో ప్రచురింతం అయ్యింది. అలాంటి పేరుగాంచిన పత్రికలో మన తెలుగు తేజం మెరిశాడు. రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా మూలాలు కలిగిన ఆరేళ్ల అనీశ్వర్ సేవలను గుర్తించిన ది టైమ్స్.. సండే టైమ్స్ మ్యాగజైన్లో కథనం ప్రచురించింది.
2021 ఫ్యూచర్ యంగ్ బ్రిటిష్ రోల్ మోడల్స్‌లో అనీశ్వర్
పర్యావరణం - సుస్థిర జీవనం అంశంలో చేసిన కృషికి గానూ 2021 ఫ్యూచర్ యంగ్ బ్రిటిష్ రోల్ మోడల్స్‌లో అనీశ్వర్ ఎంపికయ్యాడు. సండే టైమ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై అనీశ్వర్ ఫొటోతో పాటుగా అతని గురించి ప్రచురితమైంది.
నేచర్ బాయ్...జంతువుల ప్రాణరక్షకుడు..
చిత్తూరు జిల్లాకు చెందిన అనీశ్వర్ కుటుంబం ఇంగ్లాండ్‌లోని వారీంగ్టన్ పట్టణంలో నివసిస్తోంది. పాఠశాలకు వెళ్లే ఆరేళ్ల అనీశ్వర్ కుంచాల తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా సామాజిక సంస్థను ప్రారంభించాడు. పాఠశాల కాలుష్యం, అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ, ప్రకృతి సంరక్షణ వంటి పలు అంశాలపై రూపొందించిన డాక్యుమెంటరీలను పోస్టు చేసి వందలాది మందికి అవగాహన కల్పిస్తున్నాడు.
వన్యప్రాణులను సంరక్షించే టీవీ హీరోలు స్టీవ్ బ్యాక్షాల్, డేవిడ్ అటెన్‌బరో లాగానే తానూ అడవి జంతువులను రక్షించాలని భావించాడు. కొత్త తరం జంతు ప్రేమికులకు స్ఫూర్తినిచ్చేలా అడుగులు వేస్తున్నాడు. అనీశ్వర్ ఆలోచనలు తెలియాలంటే మీరు అతని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లలో పోస్టు చేస్తున్న అతని డాక్యుమెంట్లు చూడాల్సిందే...
అనీశ్వర్ తన వన్యప్రాణి వీడియోలను 2020లో లాక్డౌన్ సమయంలో తల్లిదండ్రుల మద్దతుతో రూపొందించడం మొదలుపెట్టాడు. తోటి పిల్లల్లో ప్రకృతిపై మరింత అవగాహన పెంపొందించడం, జంతువులకు సాయం అందించడానికి ఈ వీడియోలు అతనికి ఒక మార్గంగా ఉపయోగపడ్డాయి. అనీశ్వర్ డాక్యుమెంటరీలను ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు వేలాది సార్లు చూశారు. తన వీడియోల వీక్షణల ద్వారా డబ్బు సంపాదించడం మొదలు పెట్టాడు. అలా వచ్చిన మొత్తాన్ని అడవుల సంరక్షణ, అడవి జంతువుల రక్షణ కోసం ఖర్చు చేస్తున్నాడు. అతను ఇప్పుడు జంతు సంక్షేమ స్వచ్ఛంద సంస్థల కోసం, నిధుల సేకరణ కోసం తన స్వంత కార్డులు, ఆర్ట్ ప్రింట్లను కూడా తయారు చేస్తున్నాడు.
అనీశ్వర్ యూట్యూబ్ వీడియోలను చూసిన ఎవరికైనా..జంతువులు, ప్రపంచం పట్ల అతనికున్న అభిరుచి ఆకర్షిస్తుంది. ఇంత చిన్న వయస్సులో అతనికి ప్రకృతిపై ఇంత జ్ఞానం, ఆసక్తి ఉందా...అని ఆశ్చర్యపోతారు.