Traffic fines in Telangana: రోజుకు సుమారు రూ.కోటిన్నర. ఏడాదిలో దాదాపు రూ.533 కోట్లు. తెలంగాణ వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు విధించిన జరిమానాల మొత్తమిది. అందులో శిరస్త్రాణం ధరించని ఉల్లంఘనలే సుమారు కోటి పది లక్షలు నమోదయ్యాయి. మొత్తం జరిమానాల్లో వాటిదే 37.33 శాతం. ఆ తర్వాతి స్థానం (27.2%) అధిక వేగానిదే. ట్రిపుల్(ముగ్గురు) రైడింగ్ చేసినందుకు వడ్డించింది 10.2 శాతం. మొత్తం వసూళ్లలో ఈ మూడింటివే 74.7 శాతంగా నమోదు కావడాన్నిబట్టి ద్విచక్ర వాహనదారులపైనే ఎక్కువ జరిమానాలు పడినట్టయింది.
E Challan: ట్రాఫిక్ జరిమానాల బాదుడు.. ఆ వాహనదారులే టార్గెట్.!
Traffic fines in Telangana: బండి తీసుకుని రోడ్డు పైకి వెళ్తున్నామంటే ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే. ద్విచక్ర వాహనంపై వెళ్తే హెల్మెట్, బైక్ పేపర్లు, కారయితే సీట్ బెల్ట్, సంబంధిత పేపర్లు ఏవీ లేకపోయినా జరిమానాల వడ్డింపు జరగాల్సిందే. రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న దృష్ట్యా ట్రాఫిక్ పోలీసులు రూల్స్‌ను కొంచెం గట్టిగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయినా.. కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తున్నవారే. ఈ క్రమంలో తెలంగాణలో రోజువారీ జరిమానాలు ఎంత నమోదవుతున్నాయో చూద్దాం.!
వారే టార్గెట్
E Challan: ద్విచక్రవాహనంపై వెనక కూర్చున్న వ్యక్తి (పిలియన్ రైడర్) శిరస్త్రాణం ధరించకున్నా, సైబరాబాద్ కమిషనరేట్ లాంటి చోట్ల ద్విచక్రవాహనానికి అద్దం(సైడ్ మిర్రర్) లేకున్నా, హాఫ్ హెల్మెట్ ధరించినా జరిమానాలు విధిస్తుండటంతో ఈ చలాన్లు రోజూ ఇబ్బడిముబ్బడిగా నమోదవుతున్నాయి. తెలంగాణలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్రవాహనదారులే ఎక్కువగా మరణిస్తున్నారని, శిరస్త్రాణం ధరించని కారణంగానే ఎక్కువ మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలోనే వీరిపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. గతేడాది లాక్‌డౌన్ కారణంగా నాలుగైదు నెలలపాటు వాహనాలు రోడ్డెక్కకపోయినా రూ.613 కోట్ల జరిమానాలు విధించారు. గత ఆరేళ్ల కాలంలో 6,57,00,024 కేసులకుగానూ వడ్డించిన మొత్తం రూ.2,131 కోట్లుగా నమోదవడం గమనార్హం.