Telangana Corona: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. ఇవాళ ఒకేరోజు నాలుగు వేలకు పైగా మంది కొవిడ్ బారిన పడినట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజాగా 4,393 మందికి వైరస్ నిర్ధరణ అయింది. దీనితో ఇప్పటి వరకు 7,31,212 మంది మహమ్మారి బారిన పడ్డారు. ఇక ఈరోజు 2,319 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కొవిడ్ నుంచి 6,95,942 మంది రికవరీ అయ్యారు. తాజాగా మరో ఇద్దరు మృతి చెందగా.. కొవిడ్ మరణాలు 4071కి చేరాయి. ప్రస్తుతం తెలంగాణలో 31,199 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇవాళ 1643 కేసులు నమోదయ్యాయని తెలిపింది.
రెండోరోజు ఫీవర్ సర్వే
కొవిడ్‌కట్టడికి ప్రభుత్వం చేపట్టిన ఫీవర్‌సర్వే తెలంగాణలో రెండోరోజు కొనసాగింది. ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టారు. లక్షణాలు ఉన్నవారికి వెంటనే ఔషధాల కిట్ అందించారు. ఫీవర్ సర్వేను పలుచోట్ల మంత్రులు స్వయంగా పర్యవేక్షించి ప్రజల్లో అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా టీకా తీసుకోవాలని ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు. సిద్దిపేటలో ఫీవర్ సర్వే జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. వివిధ వార్డుల్లో తిరిగిన మంత్రి... స్థానికులు వ్యాక్సిన్ తీసుకున్నారో లేదో అడిగి తెలుసుకున్నారు . ఒమిక్రాన్ అంత తీవ్రం కానప్పటికీ ప్రజలు నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు.
ఇదీ చదవండి :దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం.. భారీగా మరణాలు నమోదు