TS HC on RRR Petition: సీఎం జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ అసమగ్రంగా దర్యాప్తు చేసిందని, ఈ కేసులో పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ... ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. వ్యాజ్యానికి నంబరు కేటాయించాలని ఆదేశించింది. ఇందులో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆర్వోసీ, సెబీ, ఆదాయపన్ను విభాగాల వాదనలను విన్నాక పిటిషన్ విచారణార్హతను తేలుస్తామంటూ విచారణను ఏప్రిల్ 28వ తేదీకి వాయిదా వేసింది.
జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో హైకోర్టు ఆదేశాల మేరకు ‘నీకది.. నాకిది’పై దర్యాప్తు చేసి 11 అభియోగ పత్రాలను దాఖలుచేసిన సీబీఐ... బోగస్ కంపెనీల నుంచి జగన్ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులపై దర్యాప్తు చేయకుండా ఈడీ, ఆదాయ పన్ను విభాగాలకు లేఖ రాసి చేతులు దులిపేసుకుందని, వీటిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ రఘురామకృష్ణరాజు గత ఏడాది జూన్ 24న పిల్ దాఖలుచేశారు. హైకోర్టు రిజిస్ట్రీ దీనిపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ పెండింగ్‌లో ఉంచింది. పిటిషన్‌కు నంబరు కేటాయించేలా ఆదేశాలు జారీచేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పలుమార్లు ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌పై రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలపై గత వారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం విచారించి నిర్ణయాన్ని వాయిదా వేసింది. దీనిపై మంగళవారం ఉత్తర్వులు వెలువరిస్తూ రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ నంబరు కేటాయించాలని ఆదేశించింది.
పిటిషన్‌లోని అంశాలివే..
వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేటు కంపెనీలకు, వ్యక్తులకు చేకూర్చిన లబ్ధిపై దర్యాప్తు చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసిందని, అయితే సీబీఐ కొన్ని అంశాలకే పరిమితమైందని రఘురామ కృష్ణరాజు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 2004లో రూ.11 లక్షల ఆదాయం ఉన్న జగన్.. 2009లో తండ్రి చనిపోయేనాటికి రూ.43వేల కోట్లు ఆర్జించడంపై దర్యాప్తు సమగ్రంగా జరగలేదన్నారు. జగతిలోకి హావ్‌డా, కోల్‌కతా, గువాహటిల్లోని 16 చిన్న కంపెనీల నుంచి రూ.195.70 కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. దీనిపై ఐటీ, ఈడీలకు లేఖ రాసి సీబీఐ చేతులు దులిపేసుకుందన్నారు. యాగా అసోసియేట్స్ ద్వారా హిందూజా గ్రూపునకు, మాజీ ఎంపీ బాలశౌరికి, కిన్నెట పవర్ లిమిటెడ్, ఓఎంసీ-శైలజా గ్రూపు కంపెనీ, ఇండియా బుల్స్, మయాంక్ మెహతాలకు లబ్ధి చేకూర్చగా జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు వచ్చాయన్నారు.