ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Bandi Sanjay: వచ్చే ఎన్నికల్లో 80 స్థానాలు మావే: బండి సంజయ్​ - బండి సంజయ్ కామెంట్స్

Bandi Sanjay About Telangana Elections : వచ్చే తెలంగాణ ఎన్నికల్లో భాజపా 80 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ సర్కార్‌ తెలంగాణను అభివృద్ధి చేయదని.. కేంద్రాన్ని కూడా చేయనివ్వదని విమర్శించారు. రాష్ట్రంలో రెండు మూడు పథకాలకు తప్ప మిగతా పథకాలకు నిధులు కేంద్రం ఇస్తున్నవేనని చెప్పారు. ఏప్రిల్ 14 నుంచి రెండో విడత పాదయాత్ర చేస్తామని తెలిపారు.

Bandi Sanjay About Telangana Elections
భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్​

By

Published : Mar 11, 2022, 9:15 AM IST

Bandi Sanjay About Telangana Elections : ‘తెలంగాణ ప్రభుత్వం నాలుగు నెలల కిందట చేయించిన సర్వేలో భాజపాకు 34 సీట్లు వస్తాయని తేలింది. ఈ మధ్య కాలంలో ప్రజలు, ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలే పరిష్కారంగా తెగించి కొట్లాడాం. నాతో సహా 10 వేల మంది భాజపా కార్యకర్తలపై తెరాస ప్రభుత్వం కేసులు పెట్టింది. అందులో అయిదారొందల మంది మహిళలు కూడా ఉన్నారు. మా పోరాటాన్ని ప్రజలు గుర్తించారు. దుబ్బాక, గ్రేటర్‌ హైదరాబాద్‌, హుజూరాబాద్‌ ఫలితాలు మాకు మంచి ఉత్సాహాన్నిచ్చాయి. నాలుగు రాష్ట్రాల్లో భాజపా విజయం స్ఫూర్తితో పనిచేస్తాం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం. తెలంగాణలో 80 సీట్లలో విజయం సాధిస్తాం. ‘గొల్ల’కొండ కోటపై కాషాయ పతాకాన్ని రెపరెపలాడిస్తాం. అధికారం చేపట్టాక ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యం అందిస్తాం’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌ తీరుకు నిరసనగా, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ జయంతి రోజైన ఏప్రిల్‌ 14న గద్వాల జోగులాంబ ఆలయం నుంచి రెండో విడత పాదయాత్ర మొదలుపెడుతున్నానని, దీనికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హాజరయ్యే అవకాశం ఉందని చెప్పారు. మార్చి 11తో భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్‌ బాధ్యతలు చేపట్టి రెండేళ్లయ్యింది. ఈ సందర్భంగా ఆయన ‘ఈనాడు-ఈటీవీ భారత్‌’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

కాంగ్రెస్‌ ఓటుబ్యాంకు భాజపాకు..

Bandi Sanjay About Telangana Elections 2024 : తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ రెండేళ్లలో భాజపాను పటిష్ఠం చేశా. కార్యకర్తలు, యువతలో జోష్‌ నింపా. తెరాస తీరుతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. తెరాస, భాజపా ఒక్కటేనన్న అధికారపక్షం తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టి తెరాస, కాంగ్రెస్సే ఒక్కటేనని చెప్పగలిగాం. పార్లమెంటులో తెరాస నిరసనలకు కాంగ్రెస్‌ ఫ్లోర్‌లీడర్‌ మద్దతిచ్చారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తెరాసలోకి వెళుతున్నారు. రానున్న ఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్‌, మజ్లిస్‌, వామపక్షాలు కలిసి పోటీ చేస్తాయి. అయినా ఎదుర్కొని విజయం సాధిస్తాం. నా పాదయాత్రను ఎన్నికల వరకు కొనసాగిస్తా. ప్రతినెలా 20 రోజులు పాదయాత్ర, మిగతా 10 రోజులు పార్టీకి కేటాయిస్తా. తెరాసతో కాకుండా భాజపాతో కొట్లాడుతున్న కాంగ్రెస్‌ నాయకత్వం తీరుతో ఆ పార్టీ శ్రేణులే అయోమయానికి గురవుతున్నాయి. మేం ఎక్కడ సభలు, దీక్షలు పెడితే కాంగ్రెస్‌ అక్కడ పోటీగా నిర్వహిస్తోంది. కాంగ్రెస్‌ ఓటుబ్యాంకు మా వైపు మళ్లుతోంది. హుజూరాబాద్‌ ఎన్నికే నిదర్శనం. గ్రామాల్లో వైకుంఠధామానికి రూ.11.03 లక్షలు, పల్లెప్రకృతివనానికి రూ.4.23 లక్షలు, రైతువేదికకు రూ.10 లక్షలు, డంప్‌యార్డుకు రూ.2.50 లక్షలు. నర్సరీకి రూ.1.56 లక్షలు.. ఈ నిధులన్నీ కేంద్రం ఇస్తున్నవే. ఉపాధిహామీ పథకం, రేషన్‌బియ్యం.. ఇలా చెబుతూపోతే చాలా ఉన్నాయి. తెరాస ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తోందో చెప్పాలి?

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అవసరం

Bandi Sanjay About KCR Government : తెలంగాణపై కేంద్రం వివక్ష అన్నది తెరాస తప్పుడు ప్రచారం. ఏడేళ్లలో కేంద్రం తెలంగాణకు రూ.3.20 లక్షల కోట్ల నిధులిచ్చింది. పన్నులవాటా రూ.1.04 లక్షల కోట్లు. ప్రాయోజిత పథకాలకు రూ.1.08 లక్షల కోట్లు ఇచ్చింది. రైల్వేలైన్లు, జాతీయ రహదారుల నిర్మాణం వంటివి అదనం. 1.41 లక్షల ఇళ్లకు నిధులిస్తే రాష్ట్ర సర్కారు దారి మళ్లించింది. ప్రధానమంత్రి ఆవాస్‌యోజన, ఫసల్‌బీమా వంటి పథకాలను రాష్ట్రంలో అమలు చేయదు. రైల్వే, జాతీయ రహదారుల ప్రాజెక్టులకు భూసేకరణ చేయదు. కేంద్ర పథకాలకు మ్యాచింగ్‌ గ్రాంటు ఇవ్వదు. తెరాస ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయదు. కేంద్ర ప్రభుత్వాన్ని చేయనివ్వదు. అందుకే కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉండాలని రాష్ట్ర ప్రజలు డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ కోరుకుంటున్నారు. భాజపాను గెలిపించడానికి జనం సిద్ధంగా ఉన్నారు.

దక్షిణ తెలంగాణపై దృష్టి

Bandi Sanjay Comments on CM KCR : నేను అభివృద్ధి కంటే భావోద్వేగ (మతపరమైన) అంశాలే మాట్లాడతానన్న విమర్శ వాస్తవం కాదు. రైతులు, గిరిజనులు, ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యపై కొట్లాడుతున్నా. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంపై దృష్టి పెట్టాం. అందుకే భాగ్యలక్ష్మి ఆలయం నుంచి పాదయాత్ర మొదలుపెట్టా. పార్టీ బలోపేతానికి దక్షిణ తెలంగాణపై దృష్టి పెట్టాం. ఇతర పార్టీల నేతలు భాజపాలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లపై పోరాటంతో నల్గొండలో భాజపాకు ఆదరణ లభించింది. తెరాస ఎమ్మెల్యేల ఆగడాలపై ఖమ్మంలో పోరాడుతున్నాం. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్‌ వైఖరిని ఎండగట్టి మహబూబ్‌నగర్‌లో బలపడుతున్నాం. అణచివేత చర్యలు, కార్యకర్తల్లో భయానక వాతావరణం కల్పించడానికి పోలీసు కేసులతో కేసీఆర్‌ భాజపాను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. భాజపా ముందు కేసీఆర్‌ ఆటలు సాగవు.

ABOUT THE AUTHOR

...view details