ర్యాప్.. సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తున్న ట్రెండ్. సాధారణంగా ర్యాప్ అంటే ఎక్కడైనా సరే అబ్బాయిలదే హవా. కానీ.. తెలుగు అమ్మాయిలు సైతం ర్యాప్‌లో దుమ్ములేపుతున్నారు. ఇంతకీ పాశ్చాత్య సంగీతంలో విశేషంగా రాణిస్తున్న ఆ ఆమ్మాయిలు ఎవరో తెలుసుకుందాం!
ఓవేదికపై హైదరాబాద్ అమ్మాయిలపై నేను పాడిన ర్యాప్‌కి.. ‘షేర్నీ.. సూపర్’ అంటూ ప్రేక్షకులిచ్చిన పోత్సాహాన్ని మర్చిపోలేను. నాకు నేను పెట్టుకున్న పేరిది. పులి అని అర్థం. మాది హైదరాబాద్. నాన్న శంకర్ ప్రైవేటు ఉద్యోగి. అమ్మ అంబిక గృహిణి. నాకో అన్నయ్య, తమ్ముడు. చిన్నప్పుడు ఒకమ్మాయి పాట విని నాన్న మెచ్చుకున్నారు. నేనూ ఆ మెప్పు పొందాలనుకుని.. విన్న ప్రతి పాటనీ నేర్చుకునేదాన్ని. శంకర్ మహదేవన్ ‘మహా ప్రాణదీపం’ స్ఫూర్తితో తొమ్మిదో తరగతి నుంచే పాటలు రాసి, పాడటం మొదలుపెట్టా. బహుమతులూ గెల్చుకున్నా. ఎంబీఏ చేసి ఓ రేడియోస్టేషన్‌లో ఆర్జేగా చేరా. ఓసారి రవీంద్రభారతిలో ఆగస్టు 15న మాషప్‌లో పాడే అవకాశం వచ్చింది. క్రమేపీ ర్యాప్‌తో బంధం ఏర్పడింది. 2019లో ప్రేమికుల దినోత్సవానికి చేసిన పాట అందరికీ నచ్చింది. తర్వాత హోలీపై చేసిన ప్రాజెక్ట్‌కూ పేరొచ్చింది. కొత్తగా ప్రయత్నించాలని సమ్మర్‌పై పాటకడితే యూట్యూబ్‌లో ఏడు లక్షల మంది చూశారు. ‘వద్దురా భయ్యో.. పోరిల వెంటబడి హవులా అవ్వకురా’ అంటూ చేసిన దాన్ని లక్షమందికిపైగా చూశారు. ర్యాపర్ జోతో పరిచయం నైపుణ్యాలను పెంచింది. మేం కలిసి చేసిన ‘ఆడపులి’ హిట్ అయ్యింది. కరోనాపై చేసినదానికీ పేరొచ్చింది. సాహిత్యం నుంచి పాడటం వరకు అన్నీ నేనే. పదాలు తేలికగా, అందరికీ అర్థమయ్యేలా చూసుకోవడంతోపాటు తాజా ధోరణులు.. ముఖ్యంగా అమ్మాయిల విషయాలపై దృష్టిపెడతా. పాటగా తీసుకురావడం ఖర్చుతో కూడుకున్న పని. ఎవర్నైనా సాయం కోరినా లాభముండేది కాదు. అందుకే కెరియర్ కూడా నిలుపుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఓ ప్రైవేటు సంస్థలో హెచ్‌ఆర్ మేనేజర్‌గా పని చేస్తున్నా. నా జీతంతోనే ర్యాప్ ప్రాజెక్ట్‌లు చేస్తున్నా. ‘షేర్నీ ర్యాపర్ అఫిషియల్’ వెబ్‌సైట్ ప్రారంభించా. ఈ మధ్యే నేను పాడిన ‘అమ్మ ప్రేమకు దూరమైతి’ విడుదలైంది. ఇంకా రెండున్నాయి. సంగీత దర్శకుడు రోహిత్ గోపాలకృష్ణన్ చేసిన ‘ఓపెన్ వింగ్స్’ తెలుగులో నేనే పాడా. - ఇషితా సూర్యవన్షి