ఆచార్య దేవోభవ.. అంటూ గురువుకు అగ్రపీఠం వేసిన సంస్కృతి మనది. వ్యక్తి జీవిత వికాసానికి గురువే తొలి మార్గదర్శి.
విద్యార్థి భవిష్యత్తును నిర్దేశించగల స్రష్ట. అతడి ఉన్నతిని అంచనా వేసి తీర్చిదిద్దగల ద్రష్ట. అభివృద్ధి పథంలో నడిపించే చుక్కాని. ఆధునిక కాలంలో.. పుస్తకాల్లోని పాఠాలు మాత్రమే చెప్పేవారు సాధారణ ఉపాధ్యాయులుగానే మిగిలిపోతారు. విద్యార్థుల మస్తిష్కాలకు మెరుగులు దిద్ది.. వారి సర్వతోముఖ వికాసానికి సానపెట్టేవారు ఉత్తమ గురువులు అనిపించుకుంటారు. అలాంటి వారు విద్యార్థులందరినీ తమ పిల్లలే అన్నంతగా ప్రేమిస్తారు. వారి అభ్యున్నతి కోసం నిస్వార్థంగా శ్రమిస్తారు. విద్యార్థులు వృద్ధిలోకి వస్తే తాము చిన్నపిల్లల్లా సంతోషిస్తారు. మా శిష్యులు అంటూ గర్వపడతారు. ఇలాంటి ఎందరో మహానుభావులున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యార్థుల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్న కొందరు ఉపాధ్యాయుల స్ఫూర్తిదాయక ప్రస్థానంపై..
బొమ్మలతో సృజనాత్మక బోధన
బొమ్మల సాయంతో పాఠాలు చెబుతున్న గోవిందరాజులు చదువంటే బట్టీ పట్టడం కాదు.. పాఠ్యాంశాన్ని పిల్లలు అర్థం చేసుకుని అన్వయించుకోగలగటం. అలా చదువు చెప్పాలంటే సాధారణ బోధన పద్ధతులను మించి ఇంకేదో కావాలి. అదే ఆలోచనతో బొమ్మలు, పటాలతో పిల్లల మనసుకు హత్తుకునేలా పాఠాలు చెబుతున్నారు కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలోని చినజగ్గంపేట ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు పిల్లి గోవిందరాజులు. ప్రతి పాఠ్యాంశానికి పప్పెట్లు, జంతువుల బొమ్మలు, పటాలు, బోధనోపకరణాలను సొంతంగా తయారు చేసి మరీ బోధిస్తున్నారు. సబ్బులు, థర్మాకోల్, సెలైన్ సీసాలు, ట్యూబులు, స్పాంజి, సుద్దముక్కలు, అట్టలు వంటి చౌక వస్తువులతో బోధనోపకరణాలు, పప్పెట్లు తయారు చేయడంలో ఆయన రాజస్థాన్‌లో శిక్షణ పొందారు. మొసళ్లు, తాబేళ్లు, చేపలు, పక్షులు తదితర బొమ్మలను స్పాంజితో ఆకర్షణీయంగా రూపొందించి బోధనలో వినియోగిస్తున్నారు. మానవ శరీర నిర్మాణం, రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ మండలం, వైరస్‌ల వల్ల వ్యాప్తి చెందే వ్యాధుల గురించి ప్రత్యేకంగా బొమ్మలు తయారు చేస్తున్నారు. గోవిందరాజులు తను రూపొందించిన పప్పెట్లతో విద్యార్థులే పాఠాలు చెప్పగలిగేలా తీర్చిదిద్దుతున్నారు. రంగుల కాగితాలతో బొమ్మలు, ఆకులతో లీఫ్ కార్వింగ్ కళ, పనికిరాని వస్తువులతో బోధనోపకరణాలు తయారుచేయడంలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఇలాంటి బోధనోపకరణాల తయారీపై ఉపాధ్యాయులకు జిల్లా, రాష్ట్రవ్యాప్తంగానూ ఉపాధ్యాయులకు మెలకువలు నేర్పుతున్నారు. బొమ్మల ఆధారిత బోధనపై జాతీయ స్థాయిలో పప్పెట్లతో ప్రదర్శన చేపట్టారు.
అందుకున్న పురస్కారాలు
* 2012లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
* 2020లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
* 2019లో రాష్ట్రస్థాయి టీఎల్‌ఎం ఎక్స్‌పర్ట్ అవార్డు
పాఠాలపై ఆసక్తి పెంచాలనే..
పిల్లలు పాఠాలను ఆసక్తిగా చదవాలనే ఉద్దేశంతోనే ఇలా బొమ్మలతో బోధిస్తున్నా. దీంతో చదువుతున్న అంశం వారి మనసుకు హత్తుకుంటుంది. బట్టీ విధానం కంటే ఇది ప్రయోజనకరం. - గోవిందరాజులు
పాఠాలే ప్రపంచం.. పిల్లలే జీవితం
పుదుచ్ఛేరి సీఎం నుంచి అవార్డు అందుకుంటున్న సుబ్బరాజు, విద్యార్థులు ‘గురువు’ అంటే హోదా కాదు.. రేపటి పౌరులను తయారుచేసి, సమాజానికి అందించే గురుతర బాధ్యత. అలాంటి బాధ్యతను తలకెత్తుకున్న వారిలో ఒకరు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం పత్తేపురం జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు కె.సుబ్బరాజు. 2009లో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన జీతంలో సగానికిపైగా విద్యార్థుల కోసం ఖర్చు చేస్తున్నారు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఫీజులు కట్టేందుకు, పాఠ్యపుస్తకాలు కొనేందుకు నెలకు సుమారు రూ.20 వేల నుంచి రూ.30 వేలు వెచ్చిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు రూ.10 లక్షల వరకు ఆయన ఆర్థిక సాయం అందించారు. తన సంకల్పానికి అడ్డుగా ఉండకూడదనే ఉద్దేశంతో వివాహం చేసుకోవాలనే ఆలోచనను వదులుకున్నారు.
సుబ్బరాజు శిక్షణ ఇచ్చిన విద్యార్థుల్లో 38 మంది ఎన్‌ఎంఎంఎస్ ఉపకార వేతనాలకు ఎంపికయ్యారు. 25 మంది ఐఐఐటీలలో సీట్లు పొందారు. ఎంతో మంది గురుకుల కళాశాలల్లో ప్రవేశాలు సాధించారు. జనవిజ్ఞాన వేదిక నిర్వహించే చెకుముకి పోటీ పరీక్షల్లో రాష్ట్ర స్థాయి బహుమతులు అందుకున్నారు. 2016లో పుదుచ్చేరిలో జరిగిన జాతీయ విజ్ఞాన ప్రదర్శనలో సుబ్బరాజు గైడుగా వ్యవహరించిన విద్యార్థుల బృందం మూడో స్థానంలో నిలిచి, ఆ రాష్ట్ర సీఎం నుంచి ప్రశంసాపత్రాన్ని అందుకుంది. ‘స్వచ్ఛ పాఠశాలలు’ అనే అంశంపై 2018లో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో అప్పటి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా, 2021లో ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా విద్యార్థులు, గైడు టీచరుగా సుబ్బరాజు అవార్డులు అందుకున్నారు.
నాలా ఎవరూ ఇబ్బంది పడకూడదని..
‘నా చిన్నతనంలో చదువుకోటానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ప్రతిభ ఉన్నవారికి ఆ పరిస్థితి ఎదురుకాకూడదనే ఉద్దేశంతో నాకు చేతనైన సాయం చేస్తున్నాను’ - సుబ్బరాజు
‘సాంకేతిక’ గురు.. కరోనా వేళ లక్షల మంది విద్యార్థులకు బోధనలో చేయూత
విద్యార్థుల కోసం ల్యాప్‌టాప్‌లో ప్రశ్నపత్రాలు తయారు చేస్తున్న మహేశ్వరరెడ్డి ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా ఉండాలి.. నిరంతరం నేర్చుకోవాలన్న తపన ఉన్న గురువులే విద్యార్థులకు కొత్త విషయాలు నేర్పగలుగుతారు. అలాంటి కోవకు చెందినవారే పులివెందులకు చెందిన బి.మహేశ్వరరెడ్డి. వైయస్‌ఆర్ జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో భౌతిక, రసాయనశాస్త్ర ఉపాధ్యాయుడిగా, జిల్లా సైన్స్ అధికారిగా పని చేస్తున్న ఆయన.. సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకుని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బోధిస్తున్నారు. 1997లో చిట్వేలి ప్రాథమిక పాఠశాలలో విధుల్లో చేరినప్పటి నుంచి తనదైన బోధనాశైలితో విద్యార్థులకు చేరువయ్యారు. 2000వ సంవత్సరంలో హిమకుంట్ల హైస్కూల్లో దాతల సాయంతో కంప్యూటర్లు తెప్పించి విద్యార్థులకు బోధన ప్రారంభించారు. 2009లో లింగాల మండలం బోనాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనూ విద్యార్థులకు సాంకేతిక విద్యపై అవగాహన కల్పించారు. గూగుల్ ఫామ్స్ వెబ్‌సైట్ ద్వారా ప్రశ్నపత్రాలు తయారుచేసి, కరోనా వేళ లక్ష మందికిపైగా విద్యార్థులకు చేరువయ్యారు. గణితం, ఆంగ్లం, భౌతిక, రసాయన శాస్త్రం, ఇతర పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు తయారు చేసి.. వాటిని వాట్సప్ గ్రూపుల ద్వారా అందించారు. ట్రిపుల్‌ఐటీ ప్రవేశ పరీక్ష, జాతీయ ప్రతిభ ఉపకార వేతనం, చెకుముకి, జిల్లా స్థాయి సైన్స్ పోటీలు, ఇతరత్రా పోటీ పరీక్షలకు ప్రశ్నపత్రాలు తయారు చేసి వెబ్‌సైట్‌లో ఉంచారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.40 లక్షల మంది విద్యార్థులు వీటితో పరీక్షలు రాసి తమ నైపుణ్యాన్ని పెంపొందించుకున్నారు. ఉపాధ్యాయుల బోధనాంశాలకు సంబంధించి కరదీపికలు తయారు చేయడంలో రచయితగానూ ఆయన వ్యవహరించారు.
సాంకేతికతను చేరువ చేయాలనే..
విద్యార్థులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నాను.. అందుకోసం కాలానికి అనుగుణంగా నన్ను నేను మార్చుకుంటున్నాను. - మహేశ్వరరెడ్డి
పాఠాలు చెప్పడానికి.. పదవీ విరమణ లేదని..
విద్యార్థులకు బోధిస్తున్న శ్రీరామ్ముర్తి పదవీ విరమణ చేస్తే.. పాఠాలు చెప్పడానికి స్వస్తి పలకాలా? అవసరమే లేదంటున్నారు విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు మండల శ్రీరామ్మూర్తి. 74 ఏళ్ల వయసులోనూ రోజూ 11 కి.మీ. ద్విచక్ర వాహనంపై వచ్చి, తాను పుట్టిన ఊరిలో విద్యార్థులకు ఉచితంగా పాఠాలు చెబుతున్నారు. 1976లో ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిన శ్రీరామ్మూర్తి 2006లో పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం భార్యతో కలిసి అనకాపల్లి జిల్లా చోడవరంలో నివాసం ఉంటున్నారు. తన స్వగ్రామం చీడికాడ మండలం జి.కొత్తపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో హిందీ బోధించేవారు లేరు. వారికి పాఠాలు చెప్పాలన్న ఉత్సాహంతో శ్రీరామ్మూర్తి హిందీ నేర్చుకున్నారు.
2011 నుంచి సొంతూరిలో తాను చదువుకున్న బడిలో పిల్లలకు పాఠాలు చెప్పడం ప్రారంభించారు. చోడవరం నుంచి ద్విచక్ర వాహనంపై రోజూ 11 కి.మీ. దూరంలో ఉన్న జి.కొత్తపల్లి వచ్చి ఆంగ్లం, సోషల్, హిందీ బోధించేవారు. ప్రస్తుతం ఆంగ్లం, సోషల్ పాఠాలు చెబుతున్నారు.
శ్రీరామ్మూర్తి ప్రతిరోజూ బడి గంట కొట్టక ముందే వస్తారు. తనకు కేటాయించిన తరగతులకు వెళ్లి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 3 పీరియడ్లు పిల్లలకు బోధించి ఇంటికి తిరిగి వెళతారు. ఆయనలా విశ్రాంత ఉపాధ్యాయులు అందరూ తమ గ్రామాల్లోని పాఠశాలల్లో కొంతసేపు పాఠాలు బోధిస్తే ఉపాధ్యాయుల కొరత అనేదే ఉండదని పలువురు అంటున్నారు.
చదువు చెప్పడమే ఆనందం
‘చదువు చెప్పడంలో నాకెంతో ఆనందం. అందుకే పదవీ విరమణ చేశాకా పదకొండేళ్లుగా ఆ పని చేస్తున్నా. శరీరం సహకరించినంత వరకు బోధన కొనసాగిస్తా’ - శ్రీరామ్మూర్తి
పేదింటి బిడ్డల విద్యాదాత, సొంత నిధులతో పాఠశాలను అభివృద్ధి చేసిన ఉపాధ్యాయురాలు
మూడేళ్ల కిందట మురికికూపంలా ఉన్న గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములూరిపాడు ప్రాథమికోన్నత పాఠశాల నేడు జిల్లాలోనే ఆదర్శ పాఠశాలగా రూపుదిద్దుకుంది. ‘నాడు- నేడు’ పనులకు ఓ దశలో బిల్లులు పెండింగ్‌లో పడి, పనులు నిలిచిపోతే రూ.2 లక్షలు సొంత డబ్బులు ఖర్చుపెట్టి అభివృద్ధి ఆగకుండా చూశారు ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయిని ఎం.సుబ్బలక్ష్మి. విద్యార్థులకు తాగునీరు, మరుగుదొడ్ల శుభ్రత, పాఠశాల మరమ్మతులకు ఈ మూడేళ్లలో ఆమె సుమారు రూ.లక్షన్నర వరకు వెచ్చించారు. పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకూ కృషి చేస్తున్నారు. ఆరేడు తరగతుల పిల్లలకు ఆంగ్ల పాఠాలు చెప్పే సుబ్బలక్ష్మి పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు తక్కువగా ఉండటం గమనించారు. ప్రత్యేకంగా రెమెడియల్ కోచింగ్ ఇచ్చి వారిని ఇంగ్లీష్ చదివి, రాయగలిగే స్థాయికి తీసుకొస్తున్నారు.
సుబ్బలక్ష్మి స్కూల్ అసిస్టెంట్‌గా 1991లో ఫిరంగిపురం మండలం అమీనాబాద్ జడ్పీ ఉన్నత పాఠశాలలో వృత్తి జీవితాన్ని ప్రారంభించి 2002 వరకు అక్కడే పని చేశారు. ఆ సమయంలో గ్రామంతోపాటు చుట్టుపక్కల తండాల్లోని పిల్లలు, పేద విద్యార్థులకు తన ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చేవారు. తెల్లవారుజామున 4 గంటలకు నిద్ర లేపి చదివించేవారు. ఉచితంగా ట్యూషన్లు చెప్పేవారు. తర్వాత యడ్లపాడు మండలం సొలస జడ్పీ హైస్కూల్‌లో పదేళ్లు పని చేశారు. పదో తరగతి ఆంగ్లంలో సొంతంగా మెటీరియల్ రూపొందించి ఇచ్చారు. అవి చదివి చాలామంది 90కి పైగా మార్కులు సాధించారు. సొలసలో పని చేస్తున్నప్పుడు నలుగురు పదో తరగతి అమ్మాయిలు పేదరికంతో చదువు మానేస్తుంటే సొంత డబ్బులతో గుంటూరులోని శారదా విద్యానికేతన్ స్కూల్ కం వసతిగృహంలో ఉంచి చదివించారు. వారిలో ఇద్దరు బీటెక్ పూర్తి చేశారు.
చాలా సంతోషంగా ఉంటుంది
తాము ఈ స్థాయిలో ఉండటానికి మీరే కారణమని తన శిష్యులు ఫోన్ చేసి చెబుతుంటే చాలా సంతోషంగా ఉంటుందని సుబ్బలక్ష్మి చెప్పారు. తమ ఇద్దరు అమ్మాయిలూ పేద పిల్లలకు పుస్తకాలు అవీ కొనిచ్చి సహకరిస్తుంటారని తెలిపారు.
ఇవీ చదవండి: