వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యను నిరసిస్తూ తెలుగుదేశం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. విశాఖలో తెలుగుదేశం నేతలు కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన తెలిపారు. విశాఖ డాబా గార్డెన్స్ అంబేడ్కర్ విగ్రహం వద్ద తెదేపా పార్లమెంట్ ఎస్సీ సెల్ నేతలు నిరసన తెలిపారు. దోషుల్ని శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీలపై జరుగుతున్న దాడుల్ని వ్యతిరేకిస్తూ రాజమహేంద్రవరంలో తెలుగుదేశం నేతలు నిరసన తెలిపారు. కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎస్సీలపై దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి కనీసం స్పందించడం లేదని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
TDP Protest: 'వైకాపా ఎమ్మెల్సీ ఉదయభాస్కర్‌ను అరెస్ట్ చేయాలి'
TDP concerns over Subramanian murder: మూడేళ్ల వైకాపా పాలనలో ఎస్సీలపై దాడులు పెచ్చుమీరాయని తెలుగుదేశం ఆరోపించింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన వైకాపా ఎమ్మెల్సీపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ తెదేపా నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. అమాయకులపై అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలు చేస్తుంటే.. సీఎం స్పందించటం లేదని మండిపడ్డారు. ప్రశ్నించేవారిని మాత్రం శిక్షించడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు.
సుబ్రహ్మణ్యం హత్యను నిరసిస్తూ విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. జగన్ నాయకత్వంలో వైకాపా నేతలకు చట్టం చుట్టంలా మారిందని గద్దె రామ్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కందుకూరులో తెదేపా కాగడాల ర్యాలీ నిర్వహించింది. వైకాపా ఎమ్మెల్సీని ప్రభుత్వం కాపాడేందుకు ప్రయత్నించటం సిగ్గుచేటని నేతలు విమర్శించారు. అనంతపురంలో తెదేపా చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీకి అనుమతిలేదంటూ నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైకాపా దుర్మార్గపు పాలనకు ప్రజలు స్వస్తి పలికే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: