సర్వాంగ సుందరంగా తెదేపా జాతీయ కార్యాలయం అమరావతి వేదికగానే పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాల నిర్వహణకు తెలుగుదేశం సన్నద్ధమవుతోంది. డిసెంబర్ 6న ఆ పార్టీ జాతీయ కార్యాలయాన్ని చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. మంగళగిరి సమీపంలో జాతీయ రహదారి పక్కనే నిర్మిస్తున్న తెదేపా జాతీయ కార్యాలయం అందుబాటులోకి వస్తే... అన్ని కార్యకలాపాలకు అనువుగా ఉంటుందని నేతలు భావిస్తున్నారు. మొత్తం 3 బ్లాక్‌లుగా నిర్మిస్తోన్న ఈ కార్యాలయంలో తొలుత ఒక బ్లాక్‌ను సిద్ధం చేస్తున్నారు. ప్రారంభోత్సవానికి అనువుగా తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇప్పటి వరకు సరైన వేదిక లేక పార్టీ కార్యకలాపాలన్నీ విజయవాడ, గుంటూరులో నిర్వహిస్తున్నారు. ఇకపై పార్టీకి సంబంధించిన అన్నీ కార్యక్రమాలను జాతీయ కార్యాలయం నుంచే నిర్వహించనున్నట్లు తెదేపా తెలిపింది.
1200 మందితో సమావేశమయ్యేలా మందిరం
2 లక్షల 20 వేల చదరపు అడుగుల్లో పరిపాలన, మానవ వనరుల అభివృద్ధి, డార్మిటరీ ఇలా మూడు బ్లాక్‌లుగా తెదేపా జాతీయ కార్యాలయం నిర్మితమవుతోంది. మొదటి బ్లాక్‌ను జీ ప్లస్ 3 గా నిర్మిస్తున్నారు. 2, 3 బ్లాక్‌లు జీ ప్లస్ 2 గా ఏర్పాటు అవుతున్నాయి. కార్యకర్తలతో సమావేశాల కోసం ప్రత్యేక గదులు, 1200 మందితో ఒకేసారి సమావేశమయ్యేలా ప్రత్యేక మందిరం ఏర్పాటు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నాయకులు,కార్యకర్తల కోసం విశ్రాంత గదులు, వ్యాయామశాల, నిత్య భోజనశాల నిర్మిస్తున్నారు. డిసెంబర్ 6 నుంచి అందుబాటులోకి రానున్న మొదటి బ్లాక్ మూడో అంతస్తులో అధినేత చంద్రబాబు ఛాంబర్‌తో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి ఛాంబర్, పొలిట్ బ్యూరో సమావేశమందిరంతో పాటు 200 మందితో ఏదైనా సమావేశం పెట్టుకోవటానికి వీలుగా అత్యవసర సమావేశ మందిరం నిర్మించారు. రెండో అంతస్తులో బ్యాకాఫీస్కు సంబంధించి ప్రోగ్రామ్స్ కమిటీతో పాటు నాలెడ్జ్ సెంటర్, సమాచార కేంద్రం, పార్టీ కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మొదటి అంతస్తులో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పార్టీ కార్యదర్శులు, అనుబంధ సంఘాల ఛాంబర్లను ఏర్పాటు చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో పార్టీ నేతలు మీడియా సమావేశాలు నిర్వహించేందుకు అనువుగా సమావేశమందిరం ఏర్పాటుచేశారు.
ఇదీ చదవండి :
చంద్రబాబుతో ముగిసిన ముఖ్య నేతల భేటీ