పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలోనూ... అమరావతి రగడ జరిగింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల నిర్వహణపై... ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో వివిధ పార్టీలు తమ వైఖరులు తెలియజేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావిస్తున్న మూడు రాజధానుల అంశం ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ఉందని.. సమావేశంలో ప్రస్తావించామని తెదేపా ఎంపీలు చెప్పారు.
తమ వాదన వినిపిస్తుండగా... వైకాపా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు విజయసాయి రెడ్డి, లోక్‌సభాపక్ష నేత మిథున్ రెడ్డి అడ్డుకున్నారని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ చెప్పారు. శాసనసమండలి అంశం లేవనెత్తినప్పుడు కూడా ఇదే విధంగా అడ్డుకున్నారన్నారు. కీలకమైన రాష్ట్ర సమస్యను ప్రస్తావిస్తున్నప్పుడు వైకాపా ఎంపీలు అడ్డుతగిలారని ఆరోపించారు. కేంద్ర మంత్రులు జోక్యం చేసుకొని తమ వాదన విన్నారని రవీంద్రకుమార్ తెలిపారు.