ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TDP COMPLAINT: 12 రోజుల్లోనే 50 ఖాళీ జీవోలు ఎందుకిచ్చారు: తెదేపా - ఆంధ్రప్రదేశ్ న్యూస్

ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో అర్ధరాత్రి బ్లాంక్‌ జీవోలు జారీ చేస్తున్నారని తెలుగుదేశం నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. 12 రోజుల్లో 50 బ్లాంక్‌ జీవోలు ఇచ్చారని బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం పారదర్శక పాలన చేయడం లేదని నేతలు మండిపడ్డారు.

tdp varla
tdp varla

By

Published : Aug 13, 2021, 12:49 PM IST

Updated : Aug 13, 2021, 3:40 PM IST

12 రోజుల్లోనే 50 ఖాళీ జీవోలు ఎందుకిచ్చారు

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను తెదేపా నేతలు కలిశారు. బ్లాంక్‌, రహస్య జీవోల వ్యవహారంపై గవర్నర్‌కు వర్ల రామయ్య, గద్దె రామ్మోహన్ ఫిర్యాదు చేశారు. పాలనలో జవాబుదారీతనం, పారదర్శకత పెంచేందుకు జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వాధినేతగా జోక్యం చేసుకోవాలని గవర్నర్​కు 2 పేజీల నివేదిక అందచేశారు. అర్థరాత్రులు ఖాళీ జీవోలు జారీ చేస్తూ ప్రజా సమస్యల్ని దాచిపెట్టే యత్నం ప్రభుత్వం చేస్తోందని నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న ఆర్థిక అవకతవకలు, రాజ్యాంగ విరుద్ధ రుణాలు, అవినీతి, అటవీ భూముల ఆక్రమణ, అక్రమ మైనింగ్, రాజకీయ కక్ష సాధింపులతో కూల్చివేతలు, ఇసుక అక్రమ తవ్వకాలు, హౌసింగ్ సైట్‌లలో అవినీతి వంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలపై ప్రజల్లో విస్తృత చర్చ నడుస్తుందన్నారు. అందువల్ల ఖాళీ జీవోలపై ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రజలకు తెలియాలంటే రహస్య జీవోలు బహిర్గతం కావాలన్నారు.

నిబంధనలకు విరుద్ధం

రాష్ట్ర ప్రభుత్వ చర్యలు 2005 సమాచార హక్కు చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని నేతలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్ పేరుతో జారీ అయ్యే ఉత్తర్వులు ఖాళీగా ఉండటంతో అనేక అనుమానాలకు తావివ్వటం గవర్నర్ కార్యాలయాన్ని సైతం ప్రజల్లో చులకన చేసేలా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలలో పారదర్శకత లేకపోతే దీర్ఘకాలంలో ప్రజాస్వామ్య పాలనకు ముప్పు ఏర్పడవచ్చన్నారు. సుపరిపాలన, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పారదర్శకత సూత్రాన్ని పాటించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని నేతలు విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ తీరుపై గవర్నర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేశాం. ఫిర్యాదు చేస్తే మాకేంటన్న రీతిలో వైకాపా ప్రభుత్వం ఉంది. జగన్‌ నేతృత్వంలో అర్ధరాత్రి బ్లాంక్‌ జీవోలు జారీ చేస్తున్నారు. అన్నీ బ్లాంక్‌ జీవోలే.. తేదీ, జీవో నెంబర్‌ మాత్రమే ఇస్తున్నారు. 12 రోజుల్లో 50 బ్లాంక్‌ జీవోలు ఇచ్చారు. పారదర్శక పాలన ఎందుకు చేయలేకపోతున్నారు. బ్లాంక్‌ జీవోలు చూపిస్తే గవర్నర్‌ ఆశ్చర్యపోయారు. ఇంటర్నల్‌ సెక్యూరిటీకి ప్రమాదం జరిగినప్పుడే బ్లాంక్‌ జీవోలు ఇవ్వొచ్చు. అర్ధరాత్రి జీవోలు, బ్లాంక్‌ జీవోలు ఇకనైనా మానుకోవాలి -తెదేపా నేత వర్ల రామయ్య

సర్వత్రా విమర్శలు

ప్రభుత్వం జీవో ఇస్తే అది 'పబ్లిక్‌ డాక్యుమెంట్‌' కిందే లెక్క. దానిలో ఏముందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. జీవోల జారీ వ్యవహారంపై గతంలో చాలా తక్కువ మందికి మాత్రమే అవగాహన ఉండేది. అయితే నాటి ఉమ్మడి రాష్ట్రంలోని వైఎస్ ప్రభుత్వం 2008 నుంచి జీవోల్ని ఆన్‌లైన్‌లో ఉంచటం మెుదలుపెట్టింది. ప్రభుత్వ పాలన అంతా పారదర్శకమే అని చెప్పుకునేందుకు తర్వాతి ప్రభుత్వాలు ఈ విధానాన్ని కొనసాగించాయి. రాష్ట్ర విభజన తర్వాత కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో జీవోలు ఆన్​లైన్​లో పెట్టే విధానం కొనసాగుతోంది. ప్రభుత్వ రహస్య సమాచారానికి సంబంధించిన కొన్ని జీవోలు మాత్రమే కాన్ఫిడెన్షియల్ అని పేర్కొని నెంబర్ ఇచ్చి ఖాళీగా పెడతారు. అయితే గత 12 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం 79 జీవోలు జారీ చేస్తే అందులో 50 జీవోలు బ్లాంక్(ఖాళీ) జీవోలే ఉన్నట్లు ప్రతిపక్ష పార్టీ గవర్నర్​కు ఫిర్యాదు చేసింది. అధికారుల బదిలీల నుంచి ఇతరత్రా సాధారణ అంశాలకు సంబంధించిన జీవోలను సైతం రహస్యంగా ఉంచటంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి.

ఇదీ చదవండి:

Delta Plus: రెండు డోసులు తీసుకున్నా.. 'డెల్టా ప్లస్'​కు బలి

Last Updated : Aug 13, 2021, 3:40 PM IST

ABOUT THE AUTHOR

...view details