తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. పార్టీ ముఖ్యనేతలతో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై తీర్మానాలతో పాటు భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నట్లు భేటీ తర్వాత తెదేపా ఓ ప్రకటన విడుదల చేసింది. వివేకాను హత్య చేసేందుకు 8 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చేంత అవసరం ఎవరికి ఉందో... ఇన్ని నెలలైనా ముఖ్యమంత్రి జగన్ ఎందుకు తెలుసుకోలేదని ఆ ప్రకటనలో తెదేపా నేతలు నిలదీశారు. పరిటాల రవి హత్యలో సాక్షుల్ని చంపినట్లే వివేకా కేసులో ఉన్నవారూ కొందరు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. హత్యకేసులో వాంగ్మూలం ఇచ్చిన వాచ్‌మెన్ రంగయ్యకు ఏం జరిగినా జగన్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఆయనకు ప్రభుత్వం పూర్తిరక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
రాజీనామాకు సిద్ధం..
నదీ జలాల విషయంలో జగన్ ప్రభుత్వం రాయలసీమకు ద్రోహం చేస్తోందని తెదేపా నేతలు ఆక్షేపించారు. తెలుగువారి త్యాగాలకు ప్రతీకగా నిలిచిన విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి ఎంపీ పదవులకు రాజీనామా సమర్పించేందుకు సిద్ధమని పునరుద్ఘాటించారు. వైకాపా ఎంపీలూ రాజీనామాలకు సిద్ధపడతారా అని సవాల్ విసిరారు. నూతన జాబ్ క్యాలెండర్ కోసం ఆందోళన నిర్వహించిన యువతపై కేసులు పెట్టడాన్ని ఖండించారు. ఈ నెల 28లోగా కొత్త క్యాలెండర్ ఇచ్చి తీరాలంది. నిత్యావసరాలతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించుకునేలా పోరాటాలు ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. గోదావరి వరద ముంపు ప్రాంత ప్రజలకు పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించాలని నేతలు డిమాండ్ చేశారు.