LOKESH LETTER TO CM: రాష్ట్రంలో డీఏపీ కొరత తీర్చి.. రైతులను ఆదుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. బహిరంగ మార్కెట్లో అధిక ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా పంటలకు అవసరమైన ఎరువులు సకాలంలో లభించక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎరువుల నిల్వలు సరిపడినంత ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోందని వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా నెలకొల్పిన రైతు భరోసా కేంద్రాల్లో అవసరమైన ఎరువులు అరకొరగా లభిస్తున్నాయని విమర్శించారు. ఈ సీజన్లో వరితో పాటు పత్తి, మొక్కజొన్న, మిరప, అపరాలు, మొదలగు పంటలు సాగు చేసిన రైతులకు డీఏపీ దొరక్క అవస్థలు పడుతున్నారని ధ్వజమెత్తారు. రైతులు ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదన్న లోకేశ్.. అప్పులు చేసి పెట్టుబడిగా పెట్టిన రైతులు దారుణంగా నష్టపోతున్నారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఏపీ, ఎరువులకు తీవ్ర కొరత ఏర్పడటంతో ఖరీఫ్ పంటలపై ప్రతికూల ప్రభావం చూపుతోందన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజనుకు 2.25 లక్షల టన్నుల డీఏపీని కేంద్రం రాష్ట్రానికి కేటాయించిందని తెలిపారు. ఆగష్టు నెల వరకు రాష్ట్రానికి 81వేల టన్నుల డీఏపీ చేరాల్సి ఉంటే.. ఇప్పటి వరకు సగం కూడా చేరలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ప్రాథమిక సహకార పరపతి సంఘాల ద్వారా ఎరువులను విక్రయించే వారని.. రైతులకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వచ్చి తీసుకెళ్లేవారని పేర్కొన్నారు.