ఎ1 నుంచి ఎ8 వరకూ అందరూ ప్రభుత్వ పదవులు చేపట్టి, రాష్ట్రంలో ముద్దాయిల పాలన సాగిస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పార్టీ నేతలతో శుక్రవారం ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. మంత్రివర్గంలో బెంజ్ మంత్రి ఒకరైతే, హవాలా మంత్రి మరొకరని... బూతుల మంత్రి ఇంకొకరైతే, బెట్టింగ్ మంత్రి ఒకరు, పేకాట మంత్రి వేరొకరని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నడూ లేని ఉన్మాద పాలనను రాష్ట్రంలో ఇప్పుడే చూస్తున్నామని... ఎప్పుడెలా ప్రవర్తిస్తారో, ఎవరినేం చేస్తారో, ఏ విధ్వంసం సృష్టిస్తారో అర్థం కావడం లేదని ఆందోళన వెలిబుచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఊరికో ఉన్మాది తయారవుతున్నారని ఘాటు విమర్శలు చేశారు.
సర్వే రాళ్లపై సీఎం జగన్ బొమ్మలు వేయడం తుగ్లక్ చర్యగా చంద్రబాబు అభివర్ణించారు. పాత పథకాలకే కొత్త పేర్లు పెట్టి, ప్రకటనల రూపేణా కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. మూడు ముక్కల రాజధాని అంటూ అమరావతిలో 2లక్షల కోట్ల రూపాయల సంపదను నాశనం చేశారని దుయ్యబట్టారు. జగన్ నోరు తెరిస్తే అబద్దాలు, చేసేదంతా అరాచకమన్న చంద్రబాబు... ప్రశ్నిస్తే దాడులు, దౌర్జన్యాలు, తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలతో భయోత్పాతం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 16 వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటులోనూ లక్షల కోట్ల అభివృద్ధి పనులు చేస్తే... వైకాపా వచ్చాక అన్నింటినీ ఆపేసిందని మండిపడ్డారు. ఏడాదిన్నరగా పక్కనెబట్టిన బీమా పథకానికి ఇప్పుడు పేరుమార్చి సాధించిందేంటన్న చంద్రబాబు... ఈలోపు అనేక కుటుంబాలకు జరిగిన నష్టానికి బాధ్యులెవరని నిలదీశారు.
ఐదేళ్ల కాలంలో పశ్చిమగోదావరి జిల్లాలో గణనీయమైన అభివృద్ధి చేస్తే... వైకాపా వచ్చాక ఒక్క అడుగూ ముందుకు పడలేదన్నారు. ఆక్వా రంగాన్ని దారుణంగా దెబ్బతీశారని, కరోనా పరిస్థితులను సరిగ్గా ఎదుర్కొంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కాదని అన్నారు. ప్రజల ప్రాణాలంటే జగన్‌కు లెక్కలేదన్న చంద్రబాబు..., వైకాపా నాయకులు, కార్యకర్తలు ఎలా బరితెగించారో ప్రజలే చూస్తున్నారని అన్నారు. అన్నింటిలోనూ అవినీతికి పాల్పడి సాక్ష్యాధారాలతో దొరికిపోయినా చర్యలు తీసుకోవడం లేదని ఆక్షేపించారు.
ఆన్‌లైన్ సమావేశంలో పాల్గొన్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు... కరోనా తగ్గినందున స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్న ఎస్ఈసీకి ప్రభుత్వం అడ్డు పడుతోందని మండిపడ్డారు. ప్రజల్లో వ్యతిరేకతను చూసే ఎన్నికల పోరుకు వెనుకాడుతున్నట్లు కనిపిస్తోందని అన్నారు.