ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆలయాలపై దాడులకు నిరసనగా భాజపా శ్రేణుల ఆందోళనలు

విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసంపై భాజపా, జనసేన నేతలు.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అరెస్ట్​ను ఖండిస్తూ.. పలుచోట్ల కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించారు. హిందూ ఆలయాలపై ఎన్నో దాడులు జరుగుతున్నా.. ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.

protests against attacks on temples
ఆలయాలపై దాడులను ఖండిస్తూ నిరసనలు

By

Published : Jan 6, 2021, 10:42 PM IST

రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసానికి నిరసనగా యాత్ర చేపట్టిన భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు అరెస్ట్​పై.. ఆ పార్టీ నేతలు, జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి, సీఎం జగన్.. తమ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఒంగోలులో పోలీసులతో వాగ్వాదానకిి దిగిన భాజపా నాయకులు

ప్రకాశం జిల్లాలో...

రామతీర్థంలో విగ్రహం ధ్వంసానికి నిరసనగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేపట్టిన యాత్రను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడంపై.. ఆ పార్టీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఒంగోలు కలెక్టరేట్ ఎదుట పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు పోలీసులు అందరినీ అనుమతించకపోగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గేటు తోసుకుని కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లారు. పోలీసులు అడ్డగింపుతో శాంతించిన ఉద్యమకారులు.. జిల్లా అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

చిత్తూరులో మానవహారంగా కూర్చుని ధర్నా చేస్తున్న భాజపా కార్యకర్తలు

చిత్తూరు జిల్లాలో...

రాష్ట్రంలోని ఆలయాలను రక్షించాలని ఉద్యమిస్తున్న వారి అరెస్టులను నిరసిస్తూ.. చిత్తూరు జిల్లా భాజపా నాయకులు ధర్నా నిర్వహించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆ పార్టీ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు ఏవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. దేవాదాయ శాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓ భాజపా కార్యకర్త ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కలెక్టర్ కార్యాలయం ముందు భాజపా శ్రేణుల ధర్నా

నెల్లూరు జిల్లాలో...

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అరెస్టును నిరసిస్తూ.. ఆ పార్టీ కార్యకర్తలు, జనసేన నాయకులు నెల్లూరులో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. దాదాపు 127 ఆలయాలపై దాడులు జరిగినా ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి విమర్శించారు. రామతీర్థం ఆలయాన్ని సందర్శించేందుకు ముందు అనుమతి ఇచ్చి.. తర్వాత నిరాకరించడాన్ని తప్పుపట్టారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తే ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు.

సబ్ కలెక్టర్​కు వినతిపత్రం సమర్పిస్తోన్న భాజపా శ్రేణులు

అనంతపురం జిల్లాలో...

దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ అనంతపురం జిల్లా పెనుకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట భాజపా శ్రేణులు ధర్నా నిర్వహించాయి. రామతీర్థం వెళ్లిన తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజును అరెస్టు చేయడం నిరసిస్తూ.. హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు వజ్రం భాస్కర్ రెడ్డి ధర్నా చేశారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి సబ్ కలెక్టర్ నిశాంతికి వినతి పత్రం అందజేశారు.

ఎమ్మార్వో కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న భాజపా నేతలు

ఆలయాలపై దాడులకు నిరసనగా అనంతపురంలోని పాత ఎమ్మార్వో కార్యాలయం వద్ద భాజపా నేతలు ఆందోళన నిర్వహించారు. దాడులను నిలువరించలేని మంత్రి వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని.. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిరంజీవిరెడ్డి డిమాండ్ చేశారు. హోంగార్డును బదిలీ చేయలేని హోంశాఖ మంత్రి ఆ పదవిలో కొనసాగుతూ ఏమి ఉద్ధరిస్తున్నారని విమర్మించారు. వందల సంఖ్యలో దేవాలయాలపై దాడులు జరుగుతుంటే సీఎం జగన్ ప్రభుత్వం అసమర్థంగా మారిందని ఆరోపించారు. ఓ మతం ప్రయోజనం కోసం ఆయన ఏమీ మాట్లాడటంలేదని.. భాజపా జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు అన్నారు. ఆయన పదవికి రాజీనామాచేసి మళ్లీ పోటీచేయాలని డిమాండ్ చేశారు.

కడపలో ర్యాలీగా వెళ్తున్న నిరసనకారులు

కడప జిల్లాలో...

హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించలేని వైకాపా సర్కారును గద్దె దించాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేంద్ర రెడ్డి డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​ను బర్తరఫ్ చేయాలన్నారు. ఆంధ్రుల అయోధ్య రామతీర్థంలో రాముడి విగ్రహ శిరస్సును తొలగించిన దుండగులను తక్షణం అరెస్టు చేయాలని నినాదాలు చేస్తూ.. కడప కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. రామతీర్థం సందర్శనకు వెళ్లిన తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజును పోలీసులు అడ్డుకోవడం తగదన్నారు. రేపు భారీ ఎత్తున భాజపా శ్రేణులు అక్కడకు వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ ఘటనలకు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

పులివెందులలో ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పిస్తోన్న భాజపా శ్రేణులు

రామతీర్థం ఘటనకు కారకులను వెంటనే శిక్షించాలని కోరుతూ.. కడప జిల్లా పులివెందులలో భాజపా నాయకులు, హిందూ జేఏసీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి ర్యాలీగా వెళ్లి ఎమ్మార్వోకు వినతి పత్రం సమర్పించారు. ఘటన జరిగిన వెంటనే నిందితులను శిక్షిస్తే అవి పునరావృతం కావని.. జిల్లా భాజపా మాజీ అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రామతీర్థంను పరిశీలించడానికి రెండు పార్టీలను అనుమతించి.. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్టు చేయడాన్ని తప్పుపట్టారు. గతంలో 30 దేవాలయాలను కూల్చి, మసీదుకు టోపీ పెట్టుకుని వెళ్లి, క్రైస్తవుల ప్రార్థనల్లో పాల్గొన్న చంద్రబాబు.. ఈరోజు హిందూ దేవాలయాల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. మూడు నెలల నుంచి 140 దాడి ఘటనలు జరుగుతుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

కర్నూలులో గేట్లను తోసుకుంటూ ముందుకు వస్తున్న ఆందోళనకారులు

కర్నూలు జిల్లాలో...

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు అరెస్టును నిరసిస్తూ... కర్నూలులో ఆ పార్టీ నేతలు, జనసేన నాయకులు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. భాజపా కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కార్యాలయంలోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు గేట్లు మూసివేయగా ఎక్కి లోపలికి వెళ్లేందుకు కార్యకర్తలు విఫలయత్నం చేశారు. తమ పార్టీ నాయకుల అక్రమ అరెస్టులను మానుకోవాలని డిమాండ్ చేశారు.

విజయనగరంలో నిరసన తెలుపుతున్న భాజపా నేతలు

విజయనగరం జిల్లాలో...

భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుపై దాడిని ఖండిస్తూ.. విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఆ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శనకు దిగారు.

ఆలయాలపై దాడులను ఖండిస్తూ నిరసనలు

ఇదీ చదవండి:

'మీరు మతతత్వం ప్రోత్సహించి చర్చిలు కట్టించవచ్చు..మేము మాట్లాడితే తప్పు'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details