వాహనంతో రోడ్డెక్కితే ఇంటికొచ్చే వరకూ ప్రమాదం పొంచే ఉంటుంది. కాస్త ఆదమరిచినా కబళించేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏటా సగటున 22-24 వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా ఏడెనిమిది వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దాదాపు 24 వేల మంది గాయాలపాలవుతున్నారు. చిన్నచిన్న తప్పిదాలే పెను ప్రమాదాలకు కారణమవుతున్న వేళ వీటిని సాధ్యమైనంత మేర తప్పించుకునేందుకు హై ఎండ్, మిడ్ రేంజ్ కార్లలో ఇప్పుడు అత్యాధునిక రక్షణ వ్యవస్థలు అందుబాటులో వచ్చాయి. వీటిలో కొన్నింటిని విడిగా కొనుక్కుని కార్లలో అమర్చుకోవచ్చు. తద్వారా ప్రమాదాలకు గురయ్యే అవకాశం తగ్గుతుంది. అందుకే కారు కొనేటప్పుడు ఎంత మైలేజీ ఇస్తాయి? నిర్వహణ ఖర్చు తక్కువ ఉంటుందా? అనే అంశాలతోపాటు వాటిలో ఏయే రక్షిత వ్యవస్థలున్నాయి? అవి ఎలా పని చేస్తాయి? అనే విషయాలనూ పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కారణాలు, వాటి బారినపడకుండా మనల్ని కాపాడేందుకు కార్లలో వస్తున్న రక్షణ వ్యవస్థలపై ప్రత్యేక కథనం.
ప్రమాదానికి పక్కాగా బ్రేకులు
ప్రమాద కారణం 1
రోడ్డుపై వేగంగా కారు నడుపుతున్నప్పుడు ఎదురుగా వాహనమో, మనుషులో లేదా ఇంకేదైనా అకస్మాత్తుగా అడ్డొస్తే దాన్ని ఢీకొట్టకుండా ఒక్కసారిగా బ్రేకులు వేస్తుంటాం. అయినా కారు వెంటనే ఆగకుండా కొంతమేర ముందుకెళ్లిపోతుంది. ఒక్కోసారి డ్రైవర్ స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోతారు. దీంతో ఎదురుగా వచ్చిన వాటిని ఢీకొడుతుంటారు. ఇలా ఏటా వేల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా జాతీయ, రాష్ట్ర ప్రధాన రహదారులపై వెళుతున్నప్పుడు కూడళ్ల వద్ద సర్వీసు రోడ్లలో నుంచి, పల్లె దారుల నుంచి అకస్మాత్తుగా వాహనాలు దూసుకొస్తుండటంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇలాంటి కారణాలతో జరిగిన రోడ్డుప్రమాదాలు 2,835
మృతులు 793
గాయపడ్డవారు 3,010
మీ కార్లలో ఉండాల్సిన రక్షణ వ్యవస్థలేంటి?
* యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్): కారులో ఈ వ్యవస్థ ఉంటే సడన్‌బ్రేక్ వేసినప్పుడు వాహనం అక్కడే ఆగిపోతుంది. ముందుకు జారదు. వాహనంపై డ్రైవరుకు నియంత్రణ ఉంటుంది. అకస్మాత్తుగా ఎదురుగా ఏదైనా అడ్డొచ్చినా వాహనాన్ని పక్కకు తప్పించేందుకు డ్రైవరుకు వీలవుతుంది. ప్రమాదం చోటుచేసుకునే అవకాశం తక్కువ.
* ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబీడీ): బ్రేకు వేసేటప్పుడు కారు 4 చక్రాల్లో దేనికి ఎంత బ్రేక్ ఫోర్స్ అవసరమో అంతే లభిస్తుంది. వాహనం తక్షణమే నియంత్రణలోకి వచ్చి ప్రమాద ముప్పు తగ్గుతుంది.
* బ్రేక్ అసిస్ట్ (బీఏ): అకస్మాత్తుగా ఏదైనా వాహనం ఎదురొస్తే డ్రైవరు ఆందోళనకు లోనై పూర్తిగా బ్రేకు వేసే పరిస్థితి ఉండదు. అలాంటి సందర్భాల్లో బ్రేక్ అసిస్ట్ ఉంటే సెన్సార్లు పని చేసి దానంతట అదే పూర్తి బ్రేకు పడుతుంది.
ముందున్న ముప్పును పసిగట్టేస్తాయి..
ప్రమాద కారణం 2
లారీలు, ఇతర భారీ వాహనాల డ్రైవర్లు విశ్రాంతి కోసమో లేదా వాహనం పాడైందనో వాటిని రోడ్డుపైనే ఆపేస్తుంటారు. కనీసం బ్లింకర్లు వేయరు. ఆ రోడ్డులో వేగంగా వెళ్లే వాహనదారులు.. ఒక్కోసారి ఆగి ఉన్న వాహనాలను దూరం నుంచి గమనించలేరు. దగ్గరకొచ్చాక గమనించి బ్రేకు వేసే లోపే దాన్ని ఢీకొట్టి ప్రమాదాల బారిన పడుతున్నారు. ముందు వెళ్తున్న వాహన వేగంలో ఆకస్మికంగా తేడా వచ్చినప్పుడూ దాన్ని ఊహించకపోవటంతో ఢీకొట్టి ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇలాంటి కారణాలతో జరిగిన ప్రమాదాలు 652
మృతులు 199
గాయపడ్డవారు 834
మీ కార్లలో ఉండాల్సిన రక్షణ వ్యవస్థలేంటి?
* అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (ఏఈబీ): మీరు ప్రయాణిస్తున్న వాహనం మరో వాహనానికి దగ్గరగా వెళ్తూ ఢీకొట్టే అవకాశం ఉన్నప్పుడు ఏఈబీ వ్యవస్థ ప్రమాద ముప్పును సెన్సార్ల ద్వారా ముందే పసిగడుతుంది. డ్రైవర్ బ్రేకు వేయలేకపోయినా.. దానంతటదే బ్రేకులు పడేలా చేసి వాహనాన్ని ఆపి ప్రమాదాన్ని నివారిస్తుంది లేదా తీవ్రత తగ్గిస్తుంది. కొన్ని సందర్భాల్లో డివైడర్లు, గోడలు వంటి వాటిని ఢీకొని ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటి వాటికి ఆస్కారమివ్వకుండా ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది.
గీత దాటితే హెచ్చరిక
ప్రమాద కారణం 3
జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వేలు, ఇతర ప్రధాన రహదారులపై కారు నడుపుతున్నప్పుడు కొంతమంది లేన్ డిసిప్లిన్ (వరుస క్రమశిక్షణ) పాటించరు. సరైన సిగ్నల్ ఇవ్వకుండా, బ్లింకర్లు ఆన్ చేయకుండా, వెనుక నుంచి ఏ వాహనాలు, ఎంత వేగంతో వస్తున్నాయో గమనించకుండా, ముందున్న వాహనాలను అంచనా వేయకుండా తరచూ ఒక లేన్ (వరుస) దాటి మరో లేన్‌లోకి వచ్చేస్తుంటారు. దీంతో వెనుక నుంచి వేగంగా వచ్చే వాహనాలు వీటిని ఢీకొట్టటం లేదా ఈ వాహనమే ముందున్న బండిని ఢీకొట్టటమో జరుగుతోంది.
ఇలాంటి కారణాలతో జరిగిన ప్రమాదాలు 5,195
మృతులు 1,543
గాయపడ్డవారు 5,629
మీ కార్లలో రక్షణగా ఏం అమర్చుకోవచ్చు?
* లేన్ డిపార్చర్ వార్నింగ్ (ఎల్‌డీడబ్ల్యూ): సరైన సిగ్నల్ ఇవ్వకుండా, బ్లింకర్లు వేయకుండా ఒక లేన్ నుంచి మరో వరుసలోకి కారును పోనిస్తుంటే ఈ వ్యవస్థ డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది. లేన్ తప్పకుండా అప్రమత్తం చేస్తుంది. లేన్ కీపింగ్ అసిస్టెన్స్ అనే మరో ఏర్పాటు ఉంది. వాహనం వరుస దాటితే స్టీరింగ్ ఊగి డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది.
రెప్ప వాలినా ఒప్పుకోదు
ఇలాంటి కారణాలతో జరిగిన ప్రమాదాలు 2,247
ప్రమాద కారణం 4
ఆధ్యాత్మిక, విహారయాత్రలకు చాలా మంది సొంతంగా డ్రైవ్ చేస్తూనో లేదా ఒకే డ్రైవరుతోనే దూర ప్రాంతాలకు వెళుతుంటారు. ఇలాంటప్పుడు వాహనం నడిపేవారికి తగినంత విశ్రాంతి, విరామం లభించదు. నిద్రలేమి, తీవ్ర అలసటవల్ల కారు నడిపేటప్పుడు తెలియకుండానే కళ్లు మూతపడిపోతుంటాయి. ఫలితంగా రెప్పపాటులో ప్రమాదం జరిగిపోతోంది. ప్రధానంగా రాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల మధ్య ఇలాంటి ప్రమాదాలు అధికం.
దీనికి పరిష్కారం ఏంటి?
డ్రౌజీనెస్ అండ్ అటెన్షన్ డిటెక్షన్ సిస్టమ్, స్లీప్ డిటెక్షన్ అండ్ అలర్ట్ సిస్టమ్, ఫాటిగ్ మానిటరింగ్ సిస్టమ్: వాహనం నడిపే వ్యక్తి కళ్లు మూతలు పడుతున్నా, స్టీరింగ్ తిప్పటంలో తేడాలున్నా, ముఖంలో అలసట కనిపిస్తున్నా, రెప్ప వాలుస్తున్నా.. పైన పేర్కొన్న వ్యవస్థల్లో ఏది ఉన్నా డ్రైవరును అప్రమత్తం చేస్తుంది. కాసేపు విరామం తీసుకోవాలని సూచిస్తుంది. డ్రైవరు విరామం లేకుండా ఎంతసేపటి నుంచి వాహనం నడుపుతున్నారో తెలియజేస్తుంది. ఈ పరికరాలను విడిగా కొనుక్కుని కార్లలో అమర్చుకోవచ్చు.
టైరుకు రక్షాకవచం
ప్రమాద కారణం 5
కారు వేగంగా నడుపుతున్నప్పుడు ఒక్కసారిగా టైర్ పేలిపోయి లేదా అందులోని గాలి తగ్గి వాహనం అదుపు తప్పడం. ఇలాంటప్పుడు వాహనం బోల్తాపడటం, వేరే వాటిని ఢీకొట్టడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇలాంటి కారణాలతో జరిగిన ప్రమాదాలు 1,070
మృతులు 488
గాయపడ్డవారు 1,357
మీ కార్లలో ఉండాల్సిన రక్షణ వ్యవస్థలేంటి?
టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్): ఇది ఉంటే కారు టైర్లలో తగినంత గాలి ఉందా? లేదా? అనేది రియల్‌టైమ్‌లో డ్రైవర్‌కు తెలియజేస్తుంది. తక్కువగా ఉంటే డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది.
వేగానికి కళ్లెం