శాంతి భద్రతల పరిరక్షణలో బాధితులకు మేమున్నామని భరోసా కల్పించాల్సిన పోలీసుల్లో కొందరు కట్టు తప్పుతున్నారు. కాపాడండి అంటూ వచ్చినవారిపైనే దండనకు దిగుతున్నారు. పోలీసింగ్‌లో కొంత మంది అధికార పార్టీ నాయకుల జోక్యం పెరిగిపోవటం, స్టేషన్లలో వారు చెప్పిందే వేదమన్న పరిస్థితి ఉండటమే దీనికి కారణంగా కనిపిస్తోంది. తాజాగా కృష్ణా జిల్లా కంచికచర్ల మండలానికి చెందిన రాజశేఖర్‌రెడ్డి అనే యువకుడి ఆత్మహత్య ఘటనలోనూ పోలీసులు తీరుపై విమర్శలొచ్చాయి.
నేతల మెప్పు కోసం
అధికార పార్టీ స్థానిక నేతలు తమ పరిధిలోని పోలీసుస్టేషన్లలో ఎస్సైలు, ఇన్‌స్పెక్టర్ల పోస్టింగుల్లో పైరవీలు చేస్తున్నారు. కావాల్సిన వారిని, అనుకూలంగా ఉండేవారిని నియమించేలా చూసుకుంటున్నారు. ఇలా వచ్చిన ఎస్సైలు, ఇన్‌స్పెక్టర్లు ఆ నేతలు ఏం చెప్పినా తలాడిస్తున్నారు. ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శించినా, స్థానిక నాయకుల్ని ప్రశ్నించినా కౌన్సెలింగ్ అంటూ స్టేషన్‌కు పిలిపించి ‘తమదైన శైలి’లో విచారిస్తున్నారు. దుర్భాషలాడుతూ అవమానిస్తున్నారు. నోరెత్తలేని, బలహీనవర్గాల వారిపై చేయి చేసుకుంటున్నారన్నదీ బహిరంగ రహస్యమే.
బాధితులపైనే జులుం
కొన్ని సందర్భాలలో న్యాయం చేయాలని బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వెళితే అవమానాలే ఎదురవుతున్నాయి. ఎవరిపై ఫిర్యాదు చేయాలనుకుంటున్నారో వారి సమక్షంలోనే బాధితులపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్న ఘటనలున్నాయి. అవతలి వారికి అధికారం, అండదండలు ఉండటంతో వారికి కొమ్ముకాస్తున్నారు. న్యాయం చేయాల్సిన పోలీసులే దాడులు చేస్తుంటే ఇక తాము ఎవరికి చెప్పుకోవాలంటూ బాధితులు వాపోతున్నారు.
* ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు, దాని వెనుకనున్న అధికార పార్టీ నాయకులను ప్రశ్నించినందుకు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీసుస్టేషన్‌లో ఎస్సీ యువకుడు ఇండుగుమిల్లి ప్రసాద్‌కు ఎస్సై శిరోముండనం చేయించారు. మీసాలు తీయించేసి తీవ్రంగా అవమానించారు.
* కొందరు అధికార పార్టీ నాయకులు తమను కులం పేరుతో దూషించారంటూ శ్రీకాకుళం జిల్లా టెక్కలిపట్నం గ్రామానికి చెందిన పర్రి జగన్నాథరావు, అతని తల్లి యశోదమ్మ కాశీబుగ్గ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయటానికి వెళ్లారు. ఆ నాయకుల సమక్షంలోనే బాధితుడు జగన్నాథరావును ఇన్‌స్పెక్టర్ కాలితో తన్ని, చెంపదెబ్బ కొట్టారు.
* నర్సీపట్నానికి చెందిన మత్తువైద్యుడు సుధాకర్ విషయంలో విశాఖపట్నం నగర పోలీసులు ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శల పాలైంది.