అలా చేస్తే ఎన్నికల ప్రక్రియ ఉల్లంఘనే: ఎస్ఈసీ - latest updates of corona
స్థానిక ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థులు వారి స్వప్రయోజనాల కోసం ప్రచారం చేయకూడదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలను ఎన్నికల ప్రక్రియ ఉల్లంఘనగా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.

కరోనా వైరస్ వ్యాప్తితో విపత్కర పరిస్దితులు నెలకొన్న ప్రస్తుత పరిస్ధితుల్లో పేదలకు ప్రభుత్వం అందించే సాయాన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు తమకు అనుకూలంగా మలచుకుంటే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. పలు చోట్ల రాజకీయ పార్టీ నేతలు వాలంటీర్లతో పాటు వెళ్లి ప్రభుత్వం ఇచ్చే నగదు అందిస్తూ ప్రలోబాలకు గురి చేస్తున్నట్లు తమకు ఫిర్యాదు అందినట్లు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు భాజపా అధ్యక్షుడు,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తగు ఆధారాలతో తనకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుత సంధి కాలంలో ఎన్నికల ప్రచారంపై నిషేధం కొనసాగుతుందని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వారి స్వ ప్రయోజనాలకోసం ప్రచారం చెయ్యడం, ఓటర్లును ప్రభావితం చేయకూడదన్నారు. ఇలా చేస్తే ఎన్నికల ప్రక్రియ ఉల్లంఘనగా పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. అటువంటి సంఘటన పై క్షేత్రస్థాయిలో దృష్టి సారించి, నిజానిజాలను విచారించి, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుని రావాలని 13 జిల్లాల ఎన్నికల పరిశీలకులు, జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. సంబంధిత అధికారులందరూ తగు పర్యవేక్షణ ద్వారా ఇలాంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ కోరారు.
TAGGED:
latest updates of corona