ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో సీట్ల కుదింపునకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 23ను హైకోర్టు సస్పెండ్ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ బుధవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో సీట్లు కుదించేందుకు విద్యాశాఖ ఈ ఏడాది మేలో జీవో 23ను జారీచేసింది. దీన్ని సవాలు చేస్తూ సెంట్రల్ ఆంధ్రా జూనియర్ కళాశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు కె.బ్రహ్మయ్య, మరో కళాశాల యాజమాన్యం హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశాయి. కోర్టు ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి బుధవారం విచారణకు హాజరయ్యారు.
పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు, న్యాయవాది జీఆర్ సుధాకర్ వాదనలు వినిపిస్తూ.. ‘ఏదైనా కళాశాలలో మౌలిక సదుపాయాలు లేకపోతే అందులో సీట్లను తగ్గించడం, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే గుర్తింపును రద్దు చేసే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. అంతే తప్ప.. ప్రైవేటు కళాశాలలన్నింటిని సాధారణీకరణ చేస్తూ సీట్ల కుదింపు సరికాదు. కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించకుండా ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులందరూ ఉత్తీర్ణులైన నేపథ్యంలో కళాశాలలో సీట్లను పెంచాలి తప్ప కుదించకూడదు. జీవో అమలును నిలిపివేయండి’ అని కోరారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘కొన్ని కళాశాలల్లో సెక్షన్లు చిన్నవిగా ఉన్నాయి.