రాష్ట్రంలో ఇసుక సరఫరా సాధారణ స్థితికి వచ్చిందని వైకాపా సర్కారు ప్రకటించింది. ఈ నెల 14నుంచి చేపట్టిన ఇసుక వారోత్సవాలు ముగిశాయన్న ప్రభుత్వం... వారం రోజుల్లో రూ.63 కోట్ల మేర విక్రయాలు జరిగాయని ఓ ప్రకటనలో వెల్లడించింది. వరదల సమయంలో 40 వేల క్యూబిక్ మీటర్ల వెలికితీత సాధ్యపడగా... 2 లక్షల 82 వేల టన్నులకు పెరిగిందని వివరించింది. ఈ ఏడాది వరదల కారణంగా నదుల్లో వేసిన ఇసుక మేటలు ఐదేళ్లుకు సరిపోతాయని పేర్కొంది. రాష్ట్రంలోని నదులు, జలవనరుల్లో 2 కోట్ల క్యూబిక్ మీటర్ల కంటే అధికంగానే ఇసుక నిల్వలు ఉండొచ్చని అంచనా వేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ముగిసిన ఇసుక వారోత్సవాలు
ఇసుక కొరతను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వారోత్సవాలు ఇవాళ్టితో ముగిశాయి. ఈ నెల 14న ప్రారంభించిన వారోత్సవాలు విజయవంతమయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ వారం రోజుల్లో రూ.63 కోట్ల మేర విక్రయాలు జరిగాయని స్పష్టం చేసింది. ఇసుక సరఫరా రోజుకు 2.82 లక్షల టన్నులకు పెరిగిందని ప్రభుత్వం తెలిపింది.
అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు..
వ్యక్తిగత ఆర్డర్లు, బల్క్ ఆర్డర్లకూ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా నియంత్రిత విధానంలో ఇసుక సరఫరా చేశామని తెలిపింది. జిల్లాల వారీగా ఇసుక ధరల జాబ్ కార్డు విడుదల చేసి... అక్రమ విక్రయాలకు కళ్లెం వేశామని పేర్కొంది. ఇసుక అక్రమ రవాణకు పాల్పడితే రూ.2 లక్షల జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష విధించేలా నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఇసుకపై ఫిర్యాదులు చేసేందుకు 14500 టోల్ ఫ్రీ నెంబరును అందుబాటులోకి తీసుకొచ్చామని ప్రభుత్వం వెల్లడించింది.
ఇదీ చదవండి : భాజపా బలపడుతోంది... అందుకే...!