రాష్ట్రంలో ఇసుక కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. కృష్ణా, గోదావరి నదుల్లో ఇప్పటికీ వరదనీరు ప్రవహిస్తుండటం కారణంగా... ఇసుక తవ్వకాలకు ఇబ్బందులు తలెత్తాయి. ఫలితంగా ప్రైవేటు పట్టాదారు భూముల్లో తవ్వకాలకు అనుమతించిన ప్రభుత్వం... ఆ భూముల్లోని ఇసుక ధరను టన్నుకు రూ.100 పెంచుతూ ఆదేశాలిచ్చింది. సెప్టెంబరు 5 నుంచి అమల్లోకి వచ్చిన నూతన ఇసుక విధానాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ఆ బాధ్యతల్ని జిల్లా జాయింట్ కలెక్టర్లకు అప్పగించారు.
ఏపీఎండీసీ ద్వారా ఇసుక రీచ్‌లలో జరిగే తవ్వకాలు స్టాక్ పాయింట్ల నుంచి విక్రయాలు, సరఫరా తదితర బాధ్యతల్ని పర్యవేక్షించాల్సిందిగా ప్రభుత్వం సంయుక్త పాలనాధికారులకు సూచించింది. సచివాలయంలో అన్ని జిల్లాల జేసీలతోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇసుక సరఫరాపై ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చూడాలని జేసీలకు సూచించారు.
ప్రస్తుతం రోజుకు 30 వేల మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే లక్ష మెట్రిక్ టన్నులకు పెంచాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. గోదావరి, కృష్ణా నదుల్లో వరద కొనసాగుతుండటం కారణంగా ఇసుక తవ్వకాలకు ఇబ్బంది ఏర్పడినా... త్వరలో ఇసుక లభ్యత గణనీయంగా పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రైవేటు పట్టాభూముల్లో ఉన్న ఇసుక మేటలు తవ్వడం, రిజర్వాయర్లలో డిసిల్టేషన్ ద్వారా ఇసుక తవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.