కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీనే కొనసాగాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. పార్టీ నాయకత్వ మార్పుపై అధినేత్రికి ఆయన లేఖ రాశారు. ఎన్నో క్లిష్ట పరిస్థితుల నుంచి పార్టీని గట్టెక్కించేందుకు సోనియా చేసిన కృషి మరవలేనిదని ప్రశంసించారు. తప్పని పరిస్థితుల్లో నాయకత్వ మార్పు ఆలోచన ఉంటే రాహుల్ గాంధీ ముందుకొస్తే ఆయనకే ఇవ్వాలని సూచించారు.
ఎంతో కాలం నుంచి పార్టీ పగ్గాలు రాహుల్ చేపట్టాలని శ్రేణులు ఆకాంక్షిస్తున్నట్లు శైలజానాథ్ చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ, లౌకికరాజ్య మనుగడకు రాహుల్ నాయకత్వం అవసరమని శైలజానాథ్ అన్నారు. రాహుల్ నాయకత్వంలో పార్టీ తప్పకుండా పునర్వైభవం చూస్తుందని దీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని రక్షించే ధైర్యం గాంధీ కుటుంబానికే ఉందని శైలజానాథ్ వ్యాఖ్యానించారు.