అమరావతిలో రహదారుల తవ్వకాలు, ఇసుక, మట్టి తరలింపు ఘటనలు ఆగడం లేదు. తాజాగా మోదుగులింగాయపాలెం గ్రామానికి ఉత్తర దిశగా సీడ్ యాక్సెస్ పక్కన ఉన్న రోడ్డును గుర్తు తెలియని వ్యక్తులు తవ్వి కంకర తరలించారు. ఇటీవల ఉద్దండరాయునిపాలెం వద్ద తవ్వేసిన ఎన్10 రహదారికి ఇది అర కిలోమీటరు దూరంలోనే ఉంది. ఆ ఘటన జరిగినప్పుడే రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. తాజా ఉదంతం ఆదివారం వెలుగులోకి వచ్చినా.. పది రోజుల క్రితమే జరిగినట్లుగా భావిస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస సముదాయం వరకు ఉన్న రహదారి ఇది. నాలుగు అడుగుల లోతు, 200 మీటర్ల పొడవునా తవ్వారు. సుమారు 100 టిప్పర్ల కంకర తరలించి ఉంటారని అంచనా.
రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాల్సిన ప్రదేశానికి వెళ్లేందుకు గతంలో ఈ రోడ్డు వేశారు. పనులు నిలిచిపోవడంతో చుట్టూ కంప పెరిగింది. పెద్దగా జనసంచారం ఉండదు. తవ్విన ప్రదేశంలో టిప్పర్లు, జేసీబీలు తిరిగిన ఆనవాళ్లు ఉన్నాయి. కంకర పొర లేకుండా అడుగున మట్టి కన్పిస్తోంది. దారికి ఇరువైపులా అంచుల్లో మిగిలిన కంకర రాళ్లు గుర్తుగా మిగిలాయి. అర్ధరాత్రి జేసీబీలతో తవ్వి, తరలించడం వల్ల బయటకు పొక్కలేదని తెలుస్తోంది.
- దళిత ఐకాస, స్థానికుల నిరసన..