స్థానిక ఎన్నికల్లో చివరి అంకానికి కాసేపట్లో తెరలేవనుంది. కౌంటింగ్ పక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభంకానుంది. పది, పదిన్నర గంటల మధ్య తొలి ఫలితం వెలువడనుంది. సాయంత్రం 6 గంటల్లోగా విశాఖ నగరపాలక సంస్థ మినహా మిగిలిన అన్ని చోట్లా ఫలితాలు వెల్లడయ్యే అవకాశముంది. విశాఖలో డివిజన్ల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల ఫలితాలు ఆలస్యమవుతాయని అధికారులు చెబుతున్నారు. హైకోర్టు ఆదేశాలతో ఏలూరులో ఓట్ల లెక్కింపును తాత్కాలికంగా నిలిపివేశారు. 11 నగరపాలక సంస్థల్లో 533 డివిజన్ సభ్యుల స్థానాలకు పోలైన 27 లక్షల 29 వేల 72 ఓట్లను లెక్కించనున్నారు. 71 పురపాలక, నగర పంచాయతీల్లో 1633 వార్డు సభ్యుల స్థానాలకు పోలైన 21 లక్షల 3వేల 284 ఓట్లనూ లెక్కిస్తారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట పురపాలికపై ఏర్పడిన సందిగ్ధతకు తెరపడింది. ఇక్కడ విజేతలకు ఇచ్చే ధ్రువీకరణ పత్రాల్లో హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉండాలని సూచిస్తారు. పుర, నగరపాలికల్లో పోలైన మొత్తం ఓట్లను 4 వేల 26 టేబుళ్లలో 12 వేల 607 మంది సిబ్బందితో లెక్కిస్తారు. ఈ ప్రక్రియను 4 వేల 317 మంది పర్యవేక్షిస్తారు.
జిల్లాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్ జరగనుంది. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం, పలాస - కాశీబుగ్గ పురపాలికలతో పాటు పాలకొండ నగర పంచాయతీకి సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగనుంది. కౌంటింగ్ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులుగా ముగ్గురు జేసీలను ..కలెక్టర్ నివాస్ నియమించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో 30 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 2 రౌండ్లలోనే ఫలితాలు ఇచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. విశాఖ జిల్లాలో విశాఖ మహా నగరపాలక సంస్ధకు చెందిన 98 వార్డుల ఓట్ల లెక్కింపు...... ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరుగనుంది. మొత్తం లెక్కింపు పూర్తయ్యే సరికి అర్ధరాత్రి అవ్వచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నర్సీపట్నం పురపాలికలో మాత్రం 28 వార్డులకు ఒకేసారి ఫలితాలను వెల్లడిస్తారు.
తూర్పుగోదావరి జిల్లాలో 7 పురపాలికలు, 3 నగర పంచాయతీల్లో కౌంటింగ్ నిర్వహించనున్నారు. అమలాపురం, మండపేట, రామచంద్రపురం, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, తుని పురపాలక సంఘాలతో పాటు ..ముమ్మడివరం, గొల్లప్రోలు, ఏలేశ్వరం నగర పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు చేయనున్నారు. జిల్లాలో మొత్తం 268 వార్డులకు 35 ఏకగ్రీవం కాగా....233 వార్డుల్లో కౌంటింగ్ జరగనుంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు మాత్రం వాయిదా వేశారు. కొవ్వూరు, నిడదవోలు, నరసాపురం పురపాలికలు...జంగారెడ్డిగూడెం నగర పంచాయతీల కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జంగారెడ్డిగూడెంలో 29వార్డులు... కొవ్వూరులో 10, నిడదవోలులో 28, నరసాపురంలో 28 వార్డుల ఫలితాలు ఒకే రౌండ్‌లో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
గుంటూరు జిల్లాలో గుంటూరు నగరపాలికతో పాటు.... 5 పురపాలికల్లో కౌంటింగ్ నిర్వహించనున్నారు. నల్లపాడులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, లయోలా పబ్లిక్ స్కూల్లో గుంటూరు నగరపాలక ఓట్లు లెక్కిస్తారు. 56 డివిజన్లకు చెందిన 287 మంది అభ్యర్థులు భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. తెనాలిలో 38 వార్డులు, చిలకలూరిపేటలో 35, రేపల్లెలో 24 , సత్తెనపల్లిలో 27 , వినుకొండలో 25 వార్డుల ఓట్లను లెక్కించనున్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు కర్నూల్ రోడ్డులోని సెయింట్ జేవీయర్ కళాశాలలో నిర్వహిస్తున్నారు. 49 డివిజన్ల ఓట్ల లెక్కింపు కోసం...సుమారు 700 మంది సిబ్బందిని నియమించారు. గిద్దలూరు, కనిగిరి, అద్దంకి, మార్కాపురం , చీమకుర్తిలో కౌంటింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు.