Rajagopal Reddy fires on CM KCR: తెలంగాణలోని మునుగోడు ఉపఎన్నికకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల అధికారికి నామపత్రాలు సమర్పించారు. నామినేషన్ వేసిన అనంతరం చండూరులో మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌కు దమ్ముంటే మునుగోడు నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఈసారి మునుగోడు ఫలితాలు సీఎం చెంప చెల్లుమనేలా ఉంటాయన్నారు. నల్గొండ జిల్లా అంటేనే విప్లవాల ఖిల్లాగా పేర్కొన్న అయన.. దొంగ చాటు దెబ్బ తీసేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ తట్టబుట్ట సర్దుకొని కొత్తగా కొంటున్న విమానంలో పారిపోవాలని తెలిపారు.
'మునుగోడులో పోటీకి కేసీఆర్ వస్తారా? కేటీఆర్ వస్తారా? సిద్దిపేట రోడ్లు.. మునుగోడు రోడ్లకు తేడా చూడండి. కేసీఆర్.. మీరు రాష్ట్ర ప్రజల సొత్తు రూ.లక్ష కోట్లు దోచుకున్నారు. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. వచ్చే బతుకమ్మ నాటికి కవిత తీహార్ జైలుకు వెళ్తారు. ప్రజలందరి దృష్టి మునుగోడు ఉప ఎన్నికపైనే ఉంది. దేశం మొత్తం దీనిపై చర్చించుకుంటోంది. ఈసారి పోటీ మునుగోడు ప్రజలకు కేసీఆర్ అహంకారానికి ఉంటుంది.'-కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు భాజపా అభ్యర్థి