RAINS: రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరి.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
శ్రీసత్యసాయి జిల్లా:మడకశిరతోపాటు చుట్టుపక్క ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. బుధవారం రాత్రి మూడు గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. మడకశిరలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. చాలా సేపటి వరకు వాహనాల రాకపోకలు నిలిచాయి. అరేపేట వీధిలోని లోతట్టు ప్రాంతంలో... ఇళ్లలోకి వర్షపు నీరు చేరి... ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షాలు కురిస్తే చాలు అగచాట్లు పడాల్సి వస్తోందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.
*కర్ణాటకలో భారీ వర్షాలతో....హిందూపురం పరిధిలో పెన్నానది పరవళ్లు తొక్కుతోంది. పోచంపల్లి వద్ద మరమ్మతులకు గురైన బ్రిడ్జ్ మరింత కుంగిపోవడం వల్ల....వాహనాల రాకపోకలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. నీటి రాకతో....చాలా చెరువులు నిండే అవకాశం ఉందని....స్థానికులు అంటున్నారు. అయితే...నదీపరివాహక ప్రాంతంలో పలు గ్రామాల్లో పంట పొలాలు మునిగాయి.
కర్నూలు జిల్లా: కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలో భారీ వర్షం కురిసింది. వర్షం నీటితో ఊరివంక పొంగిపొర్లుతోంది. దీంతో హాలహర్వి-నిట్రవట్టి మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. హాలహర్వి మండలంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. హాలహర్వి-గూళ్యం రహదారి కోతకు గురై... ప్రమాదకరంగా మారింది.