ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 11, 2022, 3:21 PM IST

ETV Bharat / city

Prices increased: ఇప్పుడిక 'బియ్యం' వంతు.. కొనలేం.. తినలేం..

Prices increased: వంటింట్లో ధరల మంట మండుతోంది. కందిపప్పు నుంచి ఎండుమిర్చి వరకు, మినపగుళ్ల నుంచి పామాయిల్‌ వరకు అన్నింటి ధరా పెరుగుతూ పోతోంది. ఆహార ఉత్పత్తులపై జీఎస్టీ విధించడమూ అంతిమంగా వినియోగదారుడి నెత్తినే భారం పడేస్తోంది. గ్యాస్‌ బండ ధర వాయువేగంతో దూసుకుపోతూ సామాన్యుడి గుండెల్లో గుబులు రేపుతోంది. వీటికి తోడు ఇప్పుడు బియ్యం ధర నెలన్నర వ్యవధిలో క్వింటాకు రూ.800 - 900 వరకు పెరిగి.. పేద ప్రజలను భయపెడుతున్నాయి.

time to rice prices
వంటింట్లో ధరల మంట

Rice and Pulses Price Increased: ఇప్పటికే పెట్రోలు, డీజిల్‌ సహా పలు నిత్యావసరాల ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజానీకాన్ని సన్నబియ్యం, పప్పుల ధరలు భయపెడుతున్నాయి. గతేడాది దేశం నుంచి బియ్యం ఎగుమతులు పెరగడం.. తెలంగాణ నుంచి తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలకు పెద్ద మొత్తంలో వెళ్లడం.. 25 కిలోల బస్తాపై అయిదు శాతం జీఎస్టీ.. వచ్చే సీజన్‌లో దిగుబడి తగ్గుతుందన్న అంచనా.. వెరసి బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. తాజాగా బియ్యం ఎగుమతులపై 20శాతం సుంకం విధించడంతో ధరలు దిగివస్తాయని కేంద్రం అంచనా వేస్తోంది. అయితే ఇప్పుడు సాగు చేసిన పంట నుంచి కొత్త బియ్యం రావడానికి మరో మూడు-నాలుగు నెలల సమయం పడుతుంది. అప్పటివరకు ధరలు తగ్గబోవని వ్యాపార వర్గాలంటున్నాయి. జులై నుంచి ఇక్కడ క్వింటాలుకు రూ.800-900 వరకూ ధర పెరిగింది.

ప్రస్తుతం మార్కెట్‌లో సాధారణ బియ్యం క్వింటా ధర రూ.3,900 వరకు ఉంది. సూపర్‌ఫైన్‌లో ఉత్తమ రకం ధర రూ.6,000 వరకు పలుకుతోంది. సూపర్‌ఫైన్‌ ధర రూ.5,200 వరకు ఉంది. చిల్లర మార్కెట్‌లో సోనామసూరి రకం ధర కిలో రూ.50 నుంచి సుమారు రూ.58-60కి పెరిగింది. దేశంలో అయిదు కోట్ల టన్నులకు పైగా బియ్యం నిల్వలున్నట్లు కేంద్రం చెబుతున్నా చిల్లర మార్కెట్‌లో మాత్రం ధరలు పెరుగుతుండటం గమనార్హం.మరోవైపు ‘తెలంగాణ మినహా గతేడాది వానాకాలంతో పోలిస్తే ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో దేశవ్యాప్తంగా 55 లక్షల ఎకరాల వరి సాగు విస్తీర్ణం తగ్గిందన్న కేంద్ర వ్యవసాయశాఖ నివేదిక కూడా ధరలపై ప్రభావం చూపనుంది’ అని బియ్యం ఎగుమతిదారుల సంఘం జాతీయ అధ్యక్షుడు బీవీ కృష్ణారావు ‘ఈటీవీ- భారత్’ తో చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ దేశవాళీ బియ్యానికి డిమాండ్‌ భారీగా పెరుగుతోంది.

ధరల పెరుగుదలకు ఇదీ కారణమని ఎగుమతిదారులంటున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో సాధారణ బియ్యం టన్ను ధర 380-410 అమెరికన్‌ డాలర్ల వరకు ఉంది. రానున్న రోజుల్లో మరికొంత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ‘గడిచిన ఏడాది(2021-22) కోటీ 72 లక్షల మెట్రిక్‌ టన్నుల సాధారణ బియ్యం పలు దేశాలకు ఎగుమతి అయినట్లు ‘భారత వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహారోత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి మండలి(అపెడా) తాజాగా వెల్లడించింది. అంతకుముందు ఏడాది(2020-21)తో పోలిస్తే 42 లక్షల టన్నుల ఎగుమతి అదనంగా పెరిగింది.

తగ్గిన కంది విస్తీర్ణం..గత నెలతో పోలిస్తే కందిపప్పు, మినప్పప్పు ధరలు కేజీకి రూ.11-12 వరకు పెరిగాయి. సూపర్‌ మార్కెట్లలో మరింత ఎక్కువగా ఉంటున్నాయి. కేంద్రం గత నెల నుంచి 1 కేజీ నుంచి 25 కేజీల వరకు బ్రాండ్ల పేరిట ప్యాకెట్లలో పప్పులు విక్రయిస్తే 5% జీఎస్టీ విధిస్తోంది. రాష్ట్రంలో ఏడాదికి 2.5లక్షల టన్నుల వరకు కందిపప్పు వినియోగం ఉన్నట్లు అంచనా. గత ఏడాది 8.96 లక్షల ఎకరాల్లో కంది సాగవ్వగా ఈ ఏడాది 5.57 లక్షల ఎకరాల్లోనే పంట వేశారు.

వినియోగానికి, ఉత్పత్తికి పొంతన లేని మినుము..రాష్ట్రంలో ఏడాదికి 60 -70 వేల టన్నుల మినుమల వినియోగం ఉంటుందన్నది అంచనా. దిగుబడి మాత్రం 20 వేల టన్నులకు మించి వచ్చిన దాఖలాలు లేవు. ఇటీవల కాలంలో మినుముల దిగుమతులపై ఆంక్షలను పూర్తిస్థాయిలో ఎత్తివేయడంతో బర్మా, మొజాంబిక్‌, సూడాన్‌ నుంచి పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలో అన్ని రకాల పప్పుధాన్యాలు కలిపి ఏడాదికి 7.35 లక్షల టన్నులు అవసరం కాగా.. ఉత్పత్తి 5.36 లక్షల టన్నులేనని వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈమేరకు వినియోగం కన్నా 1.99 లక్షల టన్నుల లోటు ఉండటంతో సరిహద్దు రాష్ట్రాలతోపాటు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది.


ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details