రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన 2430జీవోను ఉపసంహరించుకోవాలని ప్రెస్‌కౌన్సిల్ ఆదేశించింది. అలహాబాద్‌లో జరిగిన విచారణకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ తరుపున ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు అళపాటి సురేశ్ హాజరయ్యారు. తప్పుడు వార్తలపై చర్యలు తీసుకోవటానికి ప్రత్యేక చట్టం తీసుకురావల్సిన అవసరంలేదని, దీనివల్ల వార్త మంచిదా..? చెడ్డదా..? అని చూడకుండా ఎడాపెడా కేసులు పెట్టే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. పాత్రికేయుల్ని భయభ్రాంతులకు గురిచేసేలా జీవో ఉందంటూ... గతంలో జయలలిత ప్రభుత్వ హయాంలో కేసుల నమోదును ఉదహరించారు.
పౌరసంబంధాల శాఖ తరపున అదనపు డైరెక్టర్ కిరణ్ తమ వాదనను వినిపించారు. జీవోను దుర్వినియోగం చేయబోమని చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్నాక... జీవోను ఉపసంహరించుకోవాలని జస్టీస్ ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో హత్యకు గురైన విలేకరి సత్యనారాయణ కేసుపైనా విచారణ జరిగింది. ప్రాణభయం ఉందని ఆయన ఫిర్యాదు చేసినా... పోలీసులు స్పందించలేదని సురేశ్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును వాయిదా వేశారు. 2430జీవోపై ప్రెస్ కౌన్సిల్ ఆదేశం పట్ల ఏపీయూడబ్యూజే అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.