తెలంగాణలోని హదరాబాద్‌లో వర్షాలు-వరద ఇబ్బందులు ఇంకా తొలగడం లేదు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి.. విద్యుత్ పునరుద్దరణ పనులు జరుగుతున్న పరిస్థితిని పర్యవేక్షించారు. హఫీజ్ బాబానగర్‌లో 42 విద్యుత్ స్తంబాలు, 20 ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయన్నాయని వెల్లడించారు. నదీమ్ కాలనీలో 22 విద్యుత్ స్థంబాలు, 7 పంపిణి ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ నగర పరిధిలో అపార్ట్మెంట్ సెల్లార్లు, వీధుల్లో ముంపు కారణంగా 139 ట్రాన్స్ ఫార్మర్లలో సప్లయ్ నిలిపివేశామని పేర్కొన్నారు. వరద నీటి ఉద్ధృతి తగ్గగానే సరఫరా పునరుద్ధరిస్తామని అన్నారు.
అందుబాటులో బృందాలు
రాబోవు రెండు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశమున్నదనే హెచ్చరికల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో 189 సెక్షన్ స్థాయి డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఒక్కొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందంలో 25 మంది సుశిక్షితులైన సిబ్బంది ఉంటారని చెప్పారు. విద్యుత్ సరఫరా విషయంలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఉండేందుకు సంస్థ అన్ని చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు.
సొంత ఖర్చుతో...
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, చెడిపోయిన, దెబ్బ తిన్న విద్యుత్ సామగ్రిని ఎస్పీడీసీఎల్ సంస్థ తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. వినియోగదారులు ఎవరికీ ఎలాంటి డబ్బు ఇవ్వనవసరం లేదని తెలిపారు. ఒకవేళ ఎవరైనా విద్యుత్ సామగ్రి పేర డబ్బు డిమాండ్ చేస్తే 100 / 1912 కు ఫోన్ చేసి చీఫ్ జనరల్ మేనేజర్లకు పూర్తి వివరాలు మెసేజ్ చేయాలని సూచించారు. వాటికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.
- సీజీఎం మెట్రో జోన్ -9440813836
- సీజీఎం రంగారెడ్డి జోన్-9440813842
- సీజీఎం రూరల్ జోన్- 8331998335
- సీజీఎం మేడ్చల్ జోన్- 8331998336
పైన తెలిపిన ఫోన్ నంబర్లకు సమచారారం ఇవ్వాలని సూచించారు. వర్షం నీరు నిల్వ ఉన్నచోట, వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ వినియోగదారులు, సాధారణ ప్రజలు విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్ ఫార్మర్లు వంటివి ఎట్టి పరిస్థితుల్లో తాకొద్దని తెలిపారు. విద్యుత్ సంబంధిత అత్యవసర పరిస్థితులు ఏర్పడితే సంస్థ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఇళ్ల బయట ఉన్నా, అపార్ట్మెంట్ సెల్లార్లలోని స్విచ్ బోర్డులను వాడేప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
విద్యుత్‌కి సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉన్నా 1912 / 100 స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106, 7382071574 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. టీఎస్ఎస్పీడీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని సీఎండీ వినియోదారులను కోరారు.