ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పది'తో పోస్ట్ మాస్టర్.. గ్రామీణ డాక్ సేవక్​ల్లో 3, 677 ఖాళీలు

పదో తరగతి అర్హతతో గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలను అందుకునే అవకాశం వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో 3 వేల 677 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక నిర్వహించనున్నారు.

By

Published : Oct 17, 2019, 10:15 AM IST

Updated : Oct 17, 2019, 11:02 AM IST

post office notification

కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్​మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఇండియా పోస్ట్ పేరుతో వాణిజ్య కార్యకలాపాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్)ల ఏర్పాటుతో గ్రామాలకు విస్తరించి వాటి ప్రగతికి తద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ జీడీఎస్​ల్లోని 3 వేల 677 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్​లో 2 వేల 707, తెలంగాణలో 970 ఖాళీల్లో.. బ్రాంచి పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచి పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ ఉద్యోగాలు ఉన్నాయి.

post office notification

ఎవరు అర్హులు?

పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉన్నవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్​లో గణితం, ఇంగ్లిష్, స్థానిక భాషను తప్పనిసరిగా చదివి ఉండాలి. దీని కోసం ఎంపికైన 60 రోజుల్లో గుర్తింపు పొందిన సంస్థ నుంచి సర్టిఫికెట్ సమర్పించాలి. టెన్త్, ఇంటర్ లేదా ఆపై స్థాయి తరగతుల్లో కంప్యూటర్​ను సబ్జెక్టుగా చదివి ఉంటే ప్రత్యేకంగా సర్టిఫికెట్ అవసరం లేదు. కనీస వయస్సు 18 సంవత్సరాలు.. గరిష్ఠ వయస్సు 40 ఏళ్లు దాటకూడదు. బీబీఎం పోస్టుకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఎంపిక తర్వాత జీడీఎస్ కు అవసరమైన వసతిని తప్పనిసరిగా కల్పించాలి. ఎలాంటి వసతి కల్పించాలనే వివరాలను నోటిఫికేషన్​లో పొందుపరిచారు. సైకిల్ తొక్కగలిగే నైపుణ్యం అభ్యర్థులకు ఉండాలి. మోటార్ సైకిల్ నడపగలిగినా సరిపోతుంది. జీవనానికి అవసరమైన ఇతర ఆదాయ వనరులను అభ్యర్థి కలిగి ఉండాలి.

ఒకేసారి ఇరవై పోస్టులకు...

దేశవ్యాప్తంగా ఉన్న ఖాళీలను అనుసరించి ఒకేసారి ఒక అప్లికేషన్​లో ఇరవై పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్ణీత అర్హతలు ఉండాలి. ఇచ్చిన ప్రాధాన్యాల ప్రకారం తుది ఎంపిక ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈబీసీ అభ్యర్థులు ప్రతి 5 ఆప్షన్లకు రూ. 100 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, పీడబ్ల్యూడీ దరఖాస్తుదారులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తులు ఆన్​లైన్​లో పంపాలి.

రాత పరీక్ష లేదు

అభ్యర్థుల ఎంపిక పూర్తిగా పదో తరగతిలో పొందిన మార్కుల ఆధారంగా జరుగుతుంది. ఎలాంటి రాత పరీక్ష లేదు. అదనపు అర్హతలకు వెయిటేజీ ఉండదు. ఒకే మార్కులను పొందిన వారు ఉంటే నిబంధనల ప్రకారం ఎంపిక నిర్వహిస్తారు. ప్రాథమిక ఎంపిక అనంతరం అభ్యర్థులకు ఎస్ఎంఎస్ అందుతుంది. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది ఎంపిక ఉంటుంది. టైమ్ రిలేటెడ్ కంటిన్యుటీ అలవెన్సు కింద రెండు లెవెల్స్​లో భత్యాలు అందిస్తారు. బీపీఎంకి (లెవెల్ -1) కనీస 4 గంటలకు 12 వేల రూపాయలు.. లెవెల్ 2 కు కనీసం 5 గంటలకు 14 వేల 500 రూపాయలు చెల్లిస్తారు. ఏబీపీఎం య డాక్ సేవక్ లెవెల్ 1కు కనీసం 4 గంటలకు 10 వేల రూపాయలు.. లెవెల్ 2 కు కనీసం 5 గంటలకు 12 వేల రూపాయలు అందిస్తారు.

రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ: నవంబరు 14, 2019

వెబ్ సైట్: http://appost.in/gdsonline

Last Updated : Oct 17, 2019, 11:02 AM IST

ABOUT THE AUTHOR

...view details