'రిపబ్లిక్' మూవీ ప్రీరిలీజ్ వేడుక సందర్భంగా పవన్‌కల్యాణ్ వాడిన భాష అభ్యంతరకరంగా ఉందని సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అన్నారు. పవన్ వ్యాఖ్యల పట్ల పలువురు వైకాపా మంత్రులు, నాయకులు కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం పోసాని విలేకరులతో మాట్లాడారు. సినిమా ఈవెంట్లో పొలిటికల్ విషయాలు మాట్లాడి సీఎం, మంత్రులను విమర్శిస్తున్న పవన్.. ముందుగా పరిశ్రమలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తే చాలని వ్యాఖ్యానించారు.
తెలుగు పరిశ్రమకు ఓ పంజాబ్ అమ్మాయి.. ఎన్నో కలలతో వచ్చి సినిమాలు చెయ్యాలి అనుకుంటే.. ఇండస్ట్రీలోని ఓ ప్రముఖుడు అవకాశాలు ఇస్తానని చెప్పి కడుపు చేసి.. పెళ్లి చేసుకుంటానని ఆమెని మోసం చేశాడని... ఆ పంజాబ్ యువతి పేరు బయటకు చెప్పొద్దు కాబట్టి పవన్ కల్యాణ్ చెవిలో చెబుతానని.. ప్రశ్నించే దమ్మున్న పవన్ ఆమెకి న్యాయం చేస్తాడా? ఆమె కోసం పోరాడతాడా? అని సవాల్ విసిరారు. ఆ యువతికి న్యాయం చెయ్యకపోతే.. పవన్‌కు ప్రశ్నించే హక్కు లేదన్నారు. ఆ యువతికి న్యాయం చేస్తే పవన్‌కు తాను గుడి కడతానంటూ పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
''జగన్ అంటే నాకు అభిమానం. నేను చచ్చిపోయే వరకూ ఆయనపై అభిమానం కొనసాగుతుంది. ఒకవేళ ఆయన తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు నాకుంది. అయితే, ఆయన అలాంటి వ్యక్తికాదని నమ్ముతున్నా. వైకాపా ప్రభుత్వంలో అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్నాయని పవన్‌కల్యాణ్ ప్రశ్నిస్తే తప్పు లేదు. అందుకు సాక్ష్యాలు చూపించాలి. అది నిజమైతే మీకు నమస్కారం పెడతాం. జనసేనకే సేవ చేస్తాం. చిరంజీవిగారు పార్టీ పెట్టినప్పుడు ప్రతిపక్ష నాయకులను అసభ్య పదజాలంతో అవమానించడం మీరు ఎప్పుడైనా చూశారా? మీరు ఎవరిని ప్రేరణగా తీసుకుని దూషిస్తున్నారు? ప్రజల్లో ఒకడిగా ఆ విషయం తెలుసుకోవాల్సిన అవసరం నాకు ఉంది’''