అచ్చంపేటలో ఓ మహిళ రోజువారీ చెల్లింపు కింద అప్పు తీసుకొని కూరగాయల వ్యాపారం చేసేవారు. వ్యాపారం ఆశించిన స్థాయిలో నడవకపోవడంతో తిరిగిచెల్లించలేకపోయారు. పాత బకాయి చెల్లిస్తే తప్ప కొత్త అప్పు ఇవ్వనని వడ్డీ వ్యాపారి షరతు పెట్టడంతో రెండు తులాల బంగారం తాకట్టు పెట్టి మరీ అప్పు తీసుకొని కూరగాయల కొట్టు నడిపిస్తున్నారు.
రెక్కాడితే గాని డొక్కాడని పేదల కుటుంబాలు.. కరోనా మహమ్మారి వారి బతుకుచిత్రాన్ని ఛిద్రం చేసింది. చేతిలో పని లేక కుటుంబ పోషణ భారంగా మారింది. ఇంటి అద్దె చెల్లించేందుకు.. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మంచాన పడితే వైద్యం చేయించేందుకూ చేయి చాచాల్సిన పరిస్థితి.. అప్పు చేసైనా బతుకు బండిని నడిపిద్దామంటే తెలిసినవారూ చేబదుళ్లు ఇచ్చేందుకు వెనుకాడుతున్నారు. వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీ వసూలుతో పాటు పూచీకత్తు పెట్టుకుని మరీ నమ్మకం కుదిరితేనే అప్పులిస్తున్నారు. ‘గతంలో అప్పు కోసం ఒకరి ష్యూరిటీ ఇస్తే సరిపోయేది. ఇప్పుడు చెక్కులు, స్థిరాస్తి పత్రాలు, బంగారం తాకట్టు పెట్టాలని అడుగుతున్నారు’ అని హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి వాపోయారు.
మేడ్చల్ కండ్లకోయకు చెందిన లక్ష్మణ్‌గౌడ్ వృత్తిరీత్యా ఓ కంపెనీలో డ్రైవర్. 2 నెలల కరెంటు బిల్లు రూ.1600, మహిళా స్వయంసహాయక బృందంలో రూ.6 వేలు కట్టాలి. ఇందుకు ఎవర్ని అడిగినా అప్పు ఇవ్వడం లేదని ఆయన వాపోయారు.
* నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో వడ్డీ వ్యాపారులు చిరు వ్యాపారులకు రోజువారీ చెల్లింపుల కింద అప్పులిచ్చేవారు. ప్రస్తుతం అప్పులివ్వడం మానేశారు. ‘కలెక్టరేటు సమీపంలో ఓ వ్యక్తి రోజు చెల్లింపు కింద అప్పు తీసుకొని టీకొట్టు నడిపించేవారు. కరోనా నేపథ్యంలో కొట్టు మూసివేయాల్సి వచ్చింది. ఇప్పుడు వడ్డీ ఎక్కువిస్తానని చెప్పినా ఎవరూ అప్పు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
4 తులాల బంగారం కుదవ
ఆటోయే జీవనాధారం. లాక్‌డౌన్‌తో రుణ వాయిదా మూణ్నెళ్లు కట్టలేదు. భార్య ఆరోగ్యం దెబ్బతినడంతో అప్పు కోసం చాలా ప్రయత్నించా. తెలిసినవాళ్లలో చాలా మందికి కరోనా కారణంగా ఆదాయం లేని పరిస్థితి. మరోదారి లేక 4 తులాల బంగారాన్ని ప్రైవేటు ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టా. స్థానికంగా నయం కాకపోవడంతో హైదరాబాద్ తీసుకెళ్లాం. రూ.80 వేలు ఖర్చయింది. ఆటోపై ఇప్పటికే రూ.లక్ష అప్పుంది.
-దుబ్బాక గంగాధర్, నిజామాబాద్