పోలీసులను నాలుగు రోజులుగా ఉరుకులు పరుగులు పెట్టించిన గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటనలో కొత్త విషయం బయటపడింది. మహబూబ్‌నగర్ నుంచి ఈ నెల 5న మూత్రపిండాల వ్యాధిని నయం చేసుకునేందుకు గాంధీ ఆస్పత్రికి వచ్చిన ఓ రోగి భార్య, మరదలిపై అత్యాచారం, ఆ తర్వాత ఒకరు కనిపించకుండా పోయిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. కానీ, చివరికి అత్యాచార ఘటన అంతా కట్టుకథగా పోలీసులు తేల్చారు. గాంధీ ఆసుపత్రిలో మహిళపై అత్యాచారం జరిగిన ఆధారాలు లభించలేదని పోలీసులు వెల్లడించారు. భ్రమలకులోనై టెక్నీషియన్ అత్యాచారం చేసినట్లు ఆరోపించారని తెలిపారు. సీసీ కెమెరా దృశ్యాలు, వైద్య నివేదిక, సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. మత్తుప్రయోగం, అత్యాచారం జరగలేదని పోలీసులు తేల్చిచెప్పారు.
విత్‌డ్రాయల్ లక్షణాలు
‘‘గాంధీ ఆసుపత్రికి వచ్చిన ఇద్దరు మహిళలు కల్లుకు బానిసలు. భర్తను ఆసుపత్రిలో చేర్చిన తర్వాత ఐదు రోజుల పాటు అక్కా చెల్లెళ్లు కల్లు తాగలేదు. కల్లు తాగకపోవడంతో వారిలో విత్‌డ్రాయల్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఆగస్టు 11న రోగిని గాంధీ ఆసుపత్రిలోనే వదిలేసి అక్క వెళ్లి పోయింది. ఆగస్టు 11 నుంచి 15 వరకు ఆసుపత్రి ఆవరణలోనే ఆమె చెల్లెలు ఉంది. ఆగస్టు 12, 14 తేదీల్లో సెక్యూరిటీ గార్డుతో ఆమె సన్నిహితంగా మెలిగింది. అన్నీ క్షుణ్నంగా పరిశీలించినా ఎక్కడా అత్యాచారం జరిగినట్టు ఆధారాల్లేవు’’ -పోలీసులు