పశ్చిమ గోదావరి జిల్లాలో..
తణుకు పరిసర ప్రాంతాల్లో రెండో దశలో కేసులు వేగంగా పెరుగుతూ ఉండడంపై అధికారులు అప్రమత్తమై నియంత్రణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే గడిచిన రెండు వారాలుగా ప్రతి ఆదివారం పూర్తి లాక్‌డౌన్ అమలుచేయడానికి పిలుపునిచ్చారు. అధికారుల పిలుపునకు చాంబర్ ఆఫ్ కామర్స్ తదితర వ్యాపార సంఘాలు స్పందించి.. స్వచ్ఛందంగా తమ సంస్థలను దుకాణాలు మూసి వేయడానికి అంగీకరించారు. తణుకులో విధించిన లాక్ డౌన్ అమలును ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు పరిశీలించారు. ద్విచక్ర వాహనంపై పట్టణ ప్రధాన రహదారుల్లో పర్యటించి అధికారులకు సూచనలు చేశారు.
నెల్లూరు జిల్లాలో..
నెల్లూరులో కట్టుదిట్టంగా కర్ఫ్యూ అమలవుతోంది. కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకు ప్రజలు సంశయించాల్సిన పరిస్థితి నెలకొంది. నిత్యావసర సరకుల కొనుగోళ్లకు మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతి ఉన్న కారణంగా.. ఆ సమయంలో నగరంలో రద్దీ నెలకొంటోంది. 12 గంటల తర్వాత రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. పోలీసులు పకడ్బందీగా కర్ఫ్యూను అమలు చేస్తూ.. అనవసరంగా బయటకు వచ్చేేవారిపై చర్యలు తీసుకుంటున్నారు.
అనంతపురం జిల్లాలో..
అనంతపురంలో రంజాన్ మాసం సతామి సందర్భంగా ఉదయం 9 గంటల వరకు చికెన్, మటన్ దుకాణాలను మాత్రమే అనుమతినిచ్చారు. 9 తర్వాత వాటిని కూడా మూసివేయాలని పోలీసులు హెచ్చరించడంతో అనంతపురం నగరంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. అనంతపురంలో ఆదివారం సంపూర్ణ కర్ఫ్యూ విధించారు. ప్రభుత్వాస్పత్రిలో కరోనా రోగులకు కొత్త సమస్యలు ఎదురయ్యాయి. ఉదయం ఆస్పత్రి సిబ్బంది అల్పాహారం అందించడం ఆలస్యం కావడంతో బయట నుంచి తెచ్చేందుకు వెళ్లిన బంధువులకు నిరాశే ఎదురైంది. సంపూర్ణ కర్ఫ్యూ తో ఎక్కడా దుకాణాలు తెరుచుకోలేదు. అల్పాహారం, పాలు తదితర ఆహార పదార్థాల కోసం బయటకు వచ్చినవారు నిరాశగా వెనుదిరిగారు. ఆస్పత్రిలోనూ నీరు రాక ఇబ్బందులు పడుతున్నామని బాధితులు వాపోయారు. అధికారులు నీటి సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.