కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు ప్రత్యామ్నాయాలపై కేంద్రం దృష్టిసారించింది. గాలి నుంచి ఆక్సిజన్ తయారు చేసే మూడు ప్లాంట్లను తెలంగాణకు పంపింది. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్‌లలో వీటిని ఏర్పాటు చేశారు. వచ్చేవారం నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇతర రాష్ట్రాల డిమాండును పరిగణనలోకి తీసుకున్న మీదట సాధ్యాసాధ్యాలను పరిశీలించి తెలంగాణకు మరో మూడు ప్లాంట్లు కేటాయించాలన్న యోచనలో ఉన్నామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రతినిధి ఒకరు ‘ఈనాడు’కు చెప్పారు.
పెరిగిన ఆక్సిజన్ అవసరాలు
రాష్ట్రంలో కరోనా రెండో దశ తీవ్రస్థాయిలో ఉండటంతో అసుపత్రుల్లో చేరే వారిలో కనీసం 50 శాతం మందికి ఆక్సిజన్ అవసరమవుతోంది. రోజూ 280 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కావల్సివస్తోంది. బాధితుల సంఖ్య పెరిగితే రోజుకు కనీసం 380 మెట్రిక్ టన్నులు అవసరమని వైద్యారోగ్యశాఖ అంచనా వేసింది. కేంద్రం ఇతర రాష్ట్రాల నుంచి కొంత మేరకు ఆక్సిజన్ సరఫరా చేస్తోంది. గాలి నుంచి ఆక్సిజన్ తయారు చేసేందుకు వీలుగా హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ ఆస్పత్రులకు ప్రెజర్ స్వింగ్ అడ్‌సోర్‌ప్షన్ (పీఎస్‌ఏ) ప్లాంట్లను పంపింది. వీటి ద్వారా సహజ సిద్ధమైన గాలిని ఒత్తిడికి గురి చేయటం ద్వారా నైట్రోజన్, కార్బన్-డై-ఆక్సైడ్, ఇతర వాయువులను వేరు చేసి ఆక్సిజన్ తీస్తారు. దాన్ని ఫిల్టర్ చేసి పైప్‌లైన్ ద్వారా ఆసుపత్రిలోని వైరస్ బాధితులకు అందిస్తారు. ఇందుకు సంబంధించిన యంత్రాలను కేంద్ర ప్రభుత్వం తొలిదశలో జర్మనీ, ఇటలీ, అమెరికాల నుంచి దిగుమతి చేసుకుంది. తాజాగా దేశీయంగా కూడా కొనుగోలు చేస్తోంది. గత ఏడాది కొనుగోలు చేసిన యంత్రాల్లో కొన్నింటిని ఆక్సిజన్ కొరత ఉన్న రాష్ట్రాలకు తాజాగా అందచేసింది.
ఇదీ చదవండి:కొవిడ్-19కు కొత్త ఔషధం 'విరాఫిన్'