physically challenged people success: ఎన్నో అవహేళనలు.. ఇంకెన్నో అవమానాలు.. అవన్నీ దాటితేనే అద్భుతమైన విజయాలు సాధించగలమని నిరూపించారు. సాధారణ వ్యక్తులకు తామేమీ తీసిపోమని సత్తా చాటారు డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మరుగుజ్జు. బంజారాహిల్స్‌లోని గౌరీశంకర్ కాలనీలో నివసించే జి.శివలాల్ (39). మరుగుజ్జు అయినా ఆత్మస్థైర్యంతో జీవితంలో అడుగులు ముందుకేస్తూ అందరిచేతా ‘ఔరా’ అనిపించారు. శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ సాధించిన తొలి మరుగుజ్జుగా రికార్డు సృష్టించారు.
చాలామంది హేళన చేసినా పట్టించుకోలేదు
Sivalal got driving licence: సైకిల్ కూడా తొక్కలేవని చుట్టుపక్కల ఉన్నవారు చేసిన అవహేళనల నుంచే తనలో డ్రైవింగ్ నేర్చుకోవాలనే పట్టుదల పెరిగేలా చేసిందంటున్నారు శివలాల్. శరీరాకృతి డ్రైవింగ్‌కు అనువుగా లేకపోవడంతో.. ఏ డ్రైవింగ్ స్కూల్‌లో అడుగుపెట్టినా శిక్షణ ఇవ్వలేమని మొహం మీదే చెప్పారు. దీంతో కారు రీమోడలింగ్ చేసుకుంటే డ్రైవింగ్ నేర్చుకోవచ్చని తెలుసుకుని ఆ దిశగా ప్రయత్నాలు సాగించారు. రీమోడల్ చేసిన కారులో తొలుత ప్రయత్నం చేసి డ్రైవింగ్ చేయగలను అనే ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నారు.
కారు కొనుక్కుని మరీ..
sivalal owned a car: అనంతరం గతేడాది నవంబర్ 27న సొంతంగా కారు కొనుక్కున్నారు. క్లచ్, బ్రేక్ తనకు అందేలా మార్పులు చేయించారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి అదే కారులో డ్రైవింగ్ చేయడం నేర్చుకున్నారు. మొదలుపెట్టిన రెండు నెలల్లోనే పూర్తి నైపుణ్యాన్ని సంపాదించారు. అనంతరం లెర్నింగ్ లైసెన్స్ దరఖాస్తు చేసుకున్నారు. మూడు నెలల అనంతరం ఆగస్టు 6న శాశ్వత లైస్సెన్స్ జారీ అయ్యింది. చిన్న ప్రైవేటు ఉద్యోగం చేస్తూ బతుకు బండిని లాగుతున్న శివలాల్ భార్య చిన్మయి కూడా మరుగుజ్జే. వీరికి ఒక కుమారుడు హితేశ్.