తనపై ముఖ్యమంత్రి జగన్ చేసిన విమర్శలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిప్పికొట్టారు. ''సినిమా స్టార్.. 3 పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కల్యాణ్.. తన పిల్లలను ఏ మాధ్యమంలో చదివిస్తున్నారు?'' అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ తీవ్రంగా స్పందించారు.
"నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాని ప్రతి సారీ అంటున్నారు. నేను మూడు పెళ్లిళ్లు చేసుకుంటే మీకు వచ్చిన ఇబ్బందేంటి..? మీరు కూడా చేసుకోవచ్చు. నేను చేసుకున్న పెళ్లిళ్ల వల్లే మీరు రెండేళ్లు జైలుకు వెళ్లారా జగన్? "- పవన్ కల్యాణ్, జనసేన అధినేత
అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే రాష్ట్రంలో ఇసుక దొరకుండా చేశారని పవన్ విమర్శించారు. ఇసుక కొరత వల్ల పని దొరక్క కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ల పాటు ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన అవసరం రాదనుకున్నామని కానీ... ప్రభుత్వ వైఖరి వల్ల నాలుగు నెలలకే రోడ్డెక్కాల్సి వచ్చిందని అన్నారు. గత ప్రభుత్వంపై పవన్ ఎందుకు పోరాడలేదని విమర్శిస్తున్న వైకాపాకు నాయకులకు పవన్ సమాధానమిచ్చారు. ఇసుక విషయంలో గత ప్రభుత్వంపైనా పోరాడామని స్పష్టం చేశారు.
''జనసేన అంటే మీకు భయం''
తాము లేవనెత్తిన సమస్యలపై ముఖ్యమంత్రి ఇంత ఘాటుగా స్పందించారంటే.. కారణం జనసేన అంటే భయమనేనని పవన్ అన్నారు. కేవలం ఒక్క ఎమ్మెల్యే ఉన్న జనసేనను చూసి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైకాపా ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. ఇందుకు కారణం వారి పాలనలో ఎన్నో తప్పులున్నాయని అన్నారు.