ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వైకాపా వ్యతిరేక ఓటు చీలిపోకుండా.. అవసరమైతే వారిని ఒప్పిస్తా' - Pawan Kalyan press meet

వైకాపా వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు భాజపాను సైతం ఒప్పిస్తానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. ఆ పార్టీ అధిష్టానంతో దీనిపై చర్చిస్తానని తెలిపారు. గతంలో అమరావతి వి।షయంలో అమిత్‌షాను ఒప్పించిన అనుభవం తనకు ఉందని పవన్ గుర్తుచేశారు. పొత్తుల విషయంలోనూ అదే విధంగా ఒప్పించగలనన్న నమ్మకం ఉందని పవన్ ధీమా వ్యక్తం చేశారు.

'వైకాపా వ్యతిరేక ఓటు చీలిపోకుండా.. అవసరమైతే వారిని ఒప్పిస్తా'
'వైకాపా వ్యతిరేక ఓటు చీలిపోకుండా.. అవసరమైతే వారిని ఒప్పిస్తా'

By

Published : May 21, 2022, 6:05 AM IST

Updated : May 21, 2022, 6:44 AM IST

'వైకాపా వ్యతిరేక ఓటు చీలిపోకుండా.. అవసరమైతే వారిని ఒప్పిస్తా'

వైకాపా వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేందుకు ఎవరితోనైనా పొత్తులు పెట్టుకునేందుకు సిద్ధమని ఇటీవల ప్రకటించిన పవన్‌కల్యాణ్....మరోసారి ఈ విషయాన్ని పునరుద్ఘాచించారు. వైకాపా వ్యతిరేక ఓటు చీలిపోకుండా అవసరమైతే భాజపా అధిష్టానాన్ని సైతం పొత్తులకు ఒప్పిస్తానని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనను వారికి అర్థమయ్యేలా వివరించి...పొత్తుల విషయంలోనూ వారిని ఒప్పిస్తానన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉండాలని వారిని ఏవిధంగా ఒప్పించానో....ఇప్పుడు కూడా అదే పంథాలో ముందుకు సాగుతానన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో వివిధ అంశాలపై ఆయన విలేఖర్లతో పిచ్చాపాటీగా మాట్లాడారు.

కాపు రిజర్వేషన్లపై వైకాపా నాయకులు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే....వారికి కాపులంటే ఎంత చులకనభావం ఉందో అర్థమవుతోందన్నారు. అందుకే రిజర్వేషన్లు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారన్నారు. అదే విధంగా బీసీలను ప్రభుత్వం మోసం చేసిందన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయని పవన్ విమర్శించారు. జగన్‌పై కోడికత్తితో దాడి చేసిన వారికి పదవులివ్వడం...సొంత బాబాయి హత్య కేసును ఇప్పటి వరకు తేల్చకపోవడం ద్వారా అసాంఘిక శక్తులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని పవన్ ప్రశ్నించారు.పవన్ విలేఖర్లతో మాట్లాడుతుండగానే విద్యుత్ పోయింది. సెల్‌ఫోన్‌ లైట్‌ వెలుతూరులోనే మాట్లాడిన పవన్‌....రాష్ట్రంలో పరిస్థితులకు ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుందన్నారు.

పవన్‌కల్యాణ్‌ ఏమన్నారంటే...

*‘వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వం’ అన్న నాలుగే నాలుగు పదాలు విని ఆ పార్టీ నాయకులు ఎందుకు అంత భయపడుతున్నారు. రాష్ట్రం బలంగా ఉండటమే ముఖ్యం. రాష్ట్రం బలమే జనసేనకు బలం.

*ఎక్కడ పోటీ చేసినా పవన్‌కల్యాణ్‌ను ఓడిస్తామంటున్న వైకాపా సవాల్‌ను స్వీకరిస్తున్నా. బళ్లు ఓడలవుతాయి. ఓడలు బళ్లు అవుతాయి. నన్ను విమర్శించిన మాజీ మంత్రులకు ఈ విషయం ఇప్పటికైనా తెలుసుండాలి.

*వైకాపా ప్రభుత్వం బ్రిటిష్‌ వలస పాలనలా ఉంది.

*ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్రానికి పూర్తి అవగాహన ఉంది. పరిమితులు దాటి అప్పులు చేసిన అంశంపైనా కేంద్ర నాయకులతో మాట్లాడతా. నిజానికి ప్రభుత్వం అడిగినంత అప్పులు కేంద్రం ఇవ్వడం లేదు.

కాపు ఓటర్లు ఏమీ చేయలేరని వైకాపా అభిప్రాయం...

కాపు సామాజిక వర్గం 20% ఓట్లను చాలా తేలిగ్గా చీల్చగలమని వైకాపా భావిస్తోంది. ఈ వర్గం ఓటర్లు రాజకీయంగా తమను ఏమీ చేయలేరనే భావనతో ఉంది. ఈ వర్గాన్ని బలంగా తీసుకోనందునే రిజర్వేషన్లు ఇవ్వబోమని జగన్‌ చెప్పారు.

*బీసీలకు మేలు చేయడం అంటే వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడం. వారు అభివృధ్ధి చెందేలా కార్యక్రమాలు అమలు చేయడం. ఆర్‌ కృష్ణయ్య మంచి బీసీ నేత. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ బీసీలు తెలంగాణ బీసీ నేతల విషయంలో ఎలాంటి దృక్పథంతో ఉంటారో ఇంకా పరిశీలించాలి.

*కోడికత్తి కేసును ఎందుకు నిరూపించలేకపోయారు. ఈ విషయంలో వైకాపా తీరుపై సందేహాస్పదంగా ఉంది. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అధికారంలో ఉండీ ఎందుకు అసలు నిందితులను తేల్చలేకపోయారు. అరాచకం చేసే వారిని కాపాడితే ఇక శాంతి భద్రతలు ఎక్కడ ఉంటాయి?

మాట్లాడుతుండగానే విద్యుత్తు కోత :పవన్‌కల్యాణ్‌ మీడియతో మాట్లాడుతుండగానే దాదాపు 20 నిమిషాల పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సెల్‌ ఫోన్‌ లైట్ల వెలుగులోనే ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడుతూ... ‘ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఇదీ. అంధకార ఆంధ్రప్రదేశ్‌’ అని వ్యాఖ్యానించారు. అనంతరం జనరేటర్‌ సాయంతో లైట్లు వెలిగాయి.

తెలంగాణలోనూ పోటీ చేస్తాం : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోనూ జనసేన పోటీ చేస్తుందని పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ స్పష్టతనిచ్చారు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం, సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలో శుక్రవారం ఆయన పర్యటించారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన జనసేన కార్యకర్త యాదాద్రి జిల్లా వలిగొండ మండలం గోపరాజుపల్లికి చెందిన కొంగరి సైదులు కుటుంబాన్ని లక్కారంలో పవన్‌కల్యాణ్‌ పరామర్శించారు. సైదులు భార్య సుమతికి రూ.5లక్షల బీమా చెక్కును అందజేశారు. అనంతరం పవన్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో 20 నుంచి 30 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ కార్యాలయాన్ని తీసుకొని ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానన్నారు. ఏపీ జన్మనిస్తే.. తెలంగాణ పునర్జన్మ ఇచ్చిందని పవన్‌ వాఖ్యానించారు.

ఇదీ చదవండి:

Last Updated : May 21, 2022, 6:44 AM IST

ABOUT THE AUTHOR

...view details