బీసీలకు ప్రాధాన్యమిస్తూ లోక్‌సభ నియోజకవర్గాలవారీగా తెదేపా అధ్యక్షులను అధినేత చంద్రబాబు ఆదివారం నియమించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఒక్కో లోక్‌సభ స్థానాన్ని ఒక జిల్లాగా చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో... తెదేపా ముందుగానే ఆ దిశగా అడుగులు వేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని మరింతగా ప్రజలకు చేరువ చేసేందుకు ఈ ప్రయోగం దోహదపడుతుందని పార్టీ భావిస్తోంది. లోక్‌సభ నియోజకవర్గాలకు అధ్యక్షులతోపాటు, ప్రతి రెండు లోక్‌సభ స్థానాలకు ఒక సీనియర్ నాయకుడిని సమన్వయకర్తగా నియమించారు. లోక్‌సభ నియోజకవర్గాల అధ్యక్షులు, సమన్వయకర్తల నియామకంలో.. తెదేపాకు మొదటి నుంచీ అండగా ఉన్న బీసీలకు పెద్దపీట వేశారు.
అదే సమయంలో వివిధ సామాజిక వర్గాల మధ్య సమతూకం పాటించారు. యువతకు తగిన ప్రాధాన్యమిస్తూనే... అటు సీనియర్లకూ సముచిత గౌరవం ఇచ్చారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా... అవసరమనుకున్న చోట మాజీ మంత్రులు, మాజీ ఎంపీలనూ లోక్‌సభ నియోజకవర్గాల అధ్యక్షులుగా నియమించారు. ఇప్పటివరకు జిల్లా మొత్తానికి అధ్యక్షులుగా పని చేసిన కొందరు ఇకపై లోక్‌సభ నియోజకవర్గాలకే పరిమితం కావాల్సి వస్తుంది. అలాగే కొందరికి చోటు దక్కలేదు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పార్టీ అధ్యక్షులుగా ఉన్న... గౌతు శిరీష, చిన్నం నాయుడు, నామన రాంబాబు, బచ్చుల అర్జునుడు, దామచర్ల జనార్దన్, బీద రవిచంద్రలకు అవకాశం ఇవ్వలేదు. విశాఖ జిల్లా, నగర అధ్యక్షులుగా పని చేసిన పంచకర్ల రమేష్‌బాబు, వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీని వీడారు. పశ్చిమగోదావరి, గుంటూరు, కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల అధ్యక్షులుగా ఉన్న తోట సీతారామలక్ష్మి, జి.వి.ఆంజనేయులు, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆర్.శ్రీనివాసరెడ్డి, బి.కె.పార్థసారథి, పులివర్తి నానిలకు మళ్లీ అవకాశం ఇచ్చారు.
10 మంది బీసీలకు చోటు..
మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాల అధ్యక్షుల్లో బీసీ సామాజికవర్గానికి చెందిన వారు 10 మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన ఒకరు ఉన్నారు. బీసీల్లోనూ అత్యధికంగా యాదవ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురిని విశాఖ, ఒంగోలు, తిరుపతి లోక్‌సభ స్థానాల అధ్యక్షులుగా నియమించారు. శ్రీకాకుళం-కాళింగ, విజయనగరం-తూర్పు కాపు, అనకాపల్లి-గవర, అమలాపురం-శెట్టిబలిజ, మచిలీపట్నం-గౌడ, అనంతపురం-బోయ, హిందూపురం-కురబ సామాజిక వర్గాలకు లభించాయి. రాజమండ్రి, గుంటూరు స్థానాల్లో ఎస్సీ, అరకులో ఎస్టీ, నెల్లూరులో ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన వారిని నియమించారు.
పార్టీ లోక్‌సభ నియోజకవర్గాల అధ్యక్షులుగా నియమితులైన వారిలో మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, కె.ఎస్.జవహర్, నెట్టెం రఘురాం ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఏలూరి సాంబశివరావు, ఎమ్మెల్సీలు గుమ్మడి సంధ్యారాణి, బుద్ధా నాగ జగదీశ్వరరావులకూ అవకాశం లభించింది.
ప్రస్తుతం శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్న రెడ్డి సుబ్రమణ్యం సతీమణి రెడ్డి అనంత కుమారిని అమలాపురం లోక్‌సభ స్థానం అధ్యక్షురాలిగా నియమించారు.
మాజీ ఎంపీలు తోట సీతారామలక్ష్మి, కొనకళ్ల నారాయణలతో పాటు, పలువురు మాజీ ఎమ్మెల్యేలూ లోక్‌సభ నియోజకవర్గాల అధ్యక్షులుగా నియమితులయ్యారు. గత శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారిలోను పలువురికి ఇప్పుడు అవకాశం దక్కింది.