ఖరీఫ్ సీజన్‌లో 50 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేసినట్లు.. పౌరసరఫరాలశాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. రైతుల నుంచే నేరుగా ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటి వరకు 17 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామన్న ఆయన.. రైతులకు 21 రోజుల్లో ధాన్యం డబ్బులు చెల్లిస్తున్నామని తెలిపారు. మిల్లర్ల ప్రమేయం లేకుండా నేరుగా ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరుపుతున్నామన్నారు. ఇప్పటి వరకు రూ.1,153 కోట్ల నగదు రైతులకు చెల్లించామన్నారు.
అక్రమాలకు ఆస్కారం లేకుండా ఈ-క్రాప్ వినియోగం
వంద శాతం ఈ క్రాప్ చేశామన్న గిరిజా శంకర్.. అక్రమాలకు ఆస్కారం లేకుండా ఈ క్రాప్ డేటాని వినియోగిస్తున్నట్లు వివరించారు. ప్రతి రైతు ఖాతాని ఆధార్ కి అనుసంధానం చేశామని.. దళారులు లేకుండా నేరుగా రైతు ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామన్నారు. 80 శాతం మందికి డబ్బులు ఇవ్వడం లేదనడం అవాస్తవమని అన్నారు. పోర్టిఫైడ్ బియ్యం ఎక్కువ ఇవ్వాలని కేంద్రం ఆదేశించిందని.. అందుకు అవసరమైన యంత్రాలను మిల్లులలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కడప, విశాఖపట్నం జిల్లాల్లో పోర్టిఫైడ్ రైస్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు.