ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జూన్​ వరకు ఖర్చుల కోసం రూ. 65 వేల కోట్లు - ap govt latest news

రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఇవాళ జరగనుంది. మూడు నెలల కాలానికి కావాల్సిన ఖర్చులకు ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్​ తీసుకురానుంది. మార్చి నెలలోపు బడ్జెట్​ను ఆమోదించుకోవాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఇది సాధ్య పడనందున... ఆర్డినెన్స్​ జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

ordinance will be passed by ap government
నేడు రాష్ట్ర మంత్రి మండలి సమావేశం

By

Published : Mar 27, 2020, 5:13 AM IST

Updated : Mar 27, 2020, 8:27 AM IST

రాష్ట్రంలో రాబోయే మూడు నెలల కాలానికి అవసరమైన ఖర్చుల నిమిత్తం (ద్రవ్య వినిమయానికి ) ప్రభుత్వం ఆర్డినెన్స్​ తీసుకురాబోతోంది. ఇందుకోసం రాష్ట్ర మంత్రిమండలి ఇవాళ సమావేశం కానుంది. ఈ మేరకు ఆర్డినెన్స్​ ఆమోదం తీసుకుని రాష్ట్ర గవర్నర్​కు పంపిస్తారు. ఆయన ఆమోదంతో ఆర్డినెన్సు విడుదల కానుంది. 2020 - 21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్​ను మార్చి నెలాఖరులోపు ఆమోదించుకోవాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో బడ్జెట్​ సమావేశాలు నిర్వహించే వెసులుబాటు లేకపోవడం వల్ల ఆర్డినెన్స్​ జారీకి ప్రభుత్వం సిద్ధమైంది.

ఓటాన్​ అకౌంటూ కష్టమే

ఒక దశలో నాలుగు రోజులపాటు శాసనసభను సమావేశపరిచి మూడు నెలల కాలానికి ఓట్​ ఆన్​ అకౌంట్​ ఆమోదం పొందాలని భావించారు. ప్రస్తుతం ఇందుకు కూడా అవకాశం లేకపోవడం వల్ల కేవలం ఆర్డినెన్స్​ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

రూ. 65 వేల కోట్లకు?

ప్రస్తుతం మూడు నెలల కాలానికి ఎంత మొత్తానికి అనుమతి తీసుకుంటారనేది ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోంది. ప్రతి నెలా ఉద్యోగుల జీతాలు, ఫించన్లు, సామాజిక ఫించన్లు, వడ్డీలు, అసలు చెల్లింపులు, నవరత్నాలకు సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే రమారమి రూ.15 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఖర్చులకు కూడా పెద్ద మొత్తంలో అవసరమవుతాయి. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకే సుమారు రూ.1330 కోట్ల వరకు కావాలి. జూన్​ నెలలో రైతు భరోసా నిధులు చెల్లించాలి. సాధారణంగా సగటున నెలకు అటూ ఇటుగా రూ.15 వేల కోట్లు చొప్పున మూడు నెలలకు ఖర్చులకే రూ.45 వేల కోట్లు కావాలి. ఇతరత్రా అవసరాలు కూడా కలిసి రూ.60 వేల కోట్ల నుంచి రూ.65 వేల కోట్ల వరకు ద్రవ్య వినిమయానికి ఆమోదం తీసుకుంటారని సమాచారం.

ఆర్డినెన్స్​, కరోనా నియంత్రణపైనా చర్చ

వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి జగన్​ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కాబోతోంది. ఈ సమావేశంలోనూ మంత్రులు, అధికారులూ దూరదూరంగా కూర్చుని చర్చించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్డినెన్సు అంశంతో పాటు కరోనా నియంత్రణ చర్యలపైనా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయని సమాచారం.

ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి

పూర్తిస్థాయి ప్రభుత్వం అధికారంలో ఉండగా గతంలో ఎన్నడూ ఇలా ఆర్డినెన్సు ఇవ్వలేదు. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రయత్నం ఉండటం వల్ల ఆర్డినెన్స్​ రూపంలో ద్రవ్యవినియమానికి ఆమోదం తెచ్చుకున్నారు. కరోనా నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ ఆర్డినెన్సు తీసుకురావడం తప్ప వేరే మార్గం లేదని ప్రభుత్వం అభిప్రాయానికి వచ్చింది.

ఇదీ చదవండి:

'క్రమశిక్షణతో ఎదుర్కొందాం... లేకుంటే తప్పదు మూల్యం'

Last Updated : Mar 27, 2020, 8:27 AM IST

ABOUT THE AUTHOR

...view details